ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. వేసవి తీవ్రత ఊహించని స్థాయికి చేరనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
50 డిగ్రీల మార్కును దాటనున్న ఎండలు
ఈ వారం ముఖ్యంగా గురువారం నాడు పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. అలాగే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత 49 నుంచి 50 డిగ్రీల వరకు ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా సగటున 41 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వందలాది మండలాలపై వడగాడ్పుల ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుంది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం:
తీవ్ర వడగాడ్పులు: రాష్ట్రంలోని దాదాపు 310 మండలాల్లో అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.
సాధారణ వడగాడ్పులు: మరో 147 మండలాల్లో సాధారణ వడగాడ్పుల ప్రభావం ఉంటుంది.
వచ్చే ఆదివారం వరకు ఈ తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ అప్రమత్తత – నివారణ చర్యలు
ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్, ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ప్రజల సౌకర్యార్థం బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, నీడ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఉపాధి హామీ కూలీల పని వేళల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది.
ప్రజలకు ముఖ్య సూచనలు
జాగ్రత్తలు తప్పనిసరి: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని, ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ, కొబ్బరిబొండాలు వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి