ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల అమలును చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అన్ని రాజకీయ పక్షాలు బిల్లుకు మద్దతివ్వడంతో సబ్‌ప్లాన్ చట్టబద్ధతకు అసెంబ్లీ ఆమోదించింది. అయితే బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం తన మాటను నెగ్గించుకొంది. సభ ముందుంచిన బిల్లులో కొన్ని సూక్ష్మ సవరణలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం బిల్లును యథాతథంగా ఆమోదించుకుంది. బిల్లులో లోపాలున్నాయని, ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి కొన్ని సవరణలు చేయాలని విపక్షాలు సూచించినా కాదని, తాము తయారు చేసిన బిల్లుకే ఆమోదం తెలిపేలా చేసుకోగలిగింది. టీడీపీ సబ్ ప్లాన్ ముసాయిదాలోని 12వ క్లాజ్ కు సవరణ చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ కు కాంగ్రెస్ మినహా సభలోని అన్ని పక్షాలు మద్దతు పలికాయి. చివరి నిమిషంలో వైఎస్ఆర్ సీపీ కూడా టీడీపీతో గొంతు కలిపింది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు సవరణపై ఓటింగ్ కు అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓటింగ్ కు అనుమతించారు. అయితే ఆసమయంలో సభలో కాంగ్రెస్ సభ్యులు తక్కువగా ఉండడంతో ఆఘమేఘాల మీద పలువరు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను సభకు రప్పించారు. చివరకు టీడీపీ ప్రతిపాదించిన సవరణకు వ్యతిరేకంగా 69, అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. దీంతో తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే సబ్ ప్లాన్ లో ఆమోదించిన అనేక అంశాలపై పూర్తి స్పష్టత లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సబ్ ప్లాన్‌ల కింద కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా, అనివార్య కారణాల వలన ఖర్చుపెట్టలేని పరిస్థితుల్లో అవి మురిగిపోకుండా ఉండేలా చట్టంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న విపక్షాల ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. అది సాంకేతికంగా అసాధ్యమని సీఎం కిరణ్ తేల్చిచెప్పారు. 202, 204 అధికరణల ప్రకారం అసెంబ్లీ ద్వారా బడ్జెట్ కేటాయింపుల ఖర్చుకు ఒక ఏడాది పాటే అధికారముంటుందనీ స్పష్టం చేశారు. ఖర్చు కాని నిధులుంటే తరవాతి బడ్జెట్‌లోని సబ్ ప్లాన్ నిధులతో పాటు వాటిని కూడా తిరిగి కేటాయించాలన్న విషయాన్ని నోడల్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఖర్చు పెట్టకున్నా 10 శాతాన్ని ఆయా వర్గాలపై వెచ్చించినట్టే భావించాలని బిల్లులో పెట్టిన క్లాజుకు కూడా ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇక మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిన కీలకమైన అంబుడ్స్‌మన్ ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. సబ్‌ప్లాన్ కింద ఇప్పటివరకు ఖర్చు కాకుండా దారి మళ్లిన దాదాపు 25 వేల కోట్ల రూపాయల నిధుల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సబ్ ప్లాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం చేసిన 32 సిఫార్సుల్లో 29 సిఫార్సులను చట్టంలో చేర్చారు. బిల్లు ఆమోదం పొందాక, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు రాత్రి 11 గంటలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: