నెల్లూరు జిల్లాలో వైసిపికి పెద్ద షాక్ తగిలింది. పార్టీ నాయకత్వంపై అలిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని నియమించటంతోనే బొమ్మిరెడ్డి అలిగారు. ఎందుకంటే, ఆనం నియామకాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గడచిన నాలుగేళ్ళుగా బొమ్మిరెడ్డే నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.
టిడిపి నుండి ఆనం ఈమధ్యనే వైసిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే ఆనం వైసిపిలో చేరారు. అయితే, ఆనం తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కొడుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా వైసిపిలో చేరటంతో టిక్కెట్టు విషయం అనిశ్చిత మొదలైంది. విచిత్రమేమిటంటే ఇద్దరు కూడా పార్టీలో చేరకముందు నుండే నియోజకవర్గంలో టిక్కెట్టు పై పట్టుపట్టటారు.
ఇద్దరు పార్టీలో చేరిన తర్వాత జగన్ ఇద్దరితో విడివిడిగా మాట్లాడారు. తర్వాత సీట్ల విషయమై నేదురుమల్లికి స్పష్టమైన హామీ ఏదో ఇచ్చినట్లున్నారు. అందుకనే వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా ఆనంను జగన్ ప్రకటించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశ్యంతో ఉన్న బొమ్మిరెడ్డిలో మంటమొదలైంది. దాంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం తనను మోసం చేసిందని బొమ్మిరెడ్డి మండిపడుతున్నారు. మనసు చంపుకుని పార్టీలో కొనసాగలేకే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించటం గమనార్హం. మరి పార్టీకి మాత్రమే రాజీనామా చేశారా లేకపోతే జిల్లా పరిషత్ ఛైర్మన్ పోస్టుకు కూడా రాజీనామా చేశారా అన్న విషయంలో క్లారిటీ లేదు.