సోము వీర్రాజుకు మామూలుగానే ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అలాంటిది కొత్తగా రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడుగా అయిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇంతకీ వీర్రాజు రెచ్చిపోతున్నది ఎవరి మీదంటే ప్రధాన ప్రతిపక్షం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మీద. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నోరు తెరవటం ఆలస్యం వెంటనే వీర్రాజు రెచ్చిపోతున్నాడు. చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడిపోతున్నాడు. ఒక రకంగా చంద్రబాబు మీద మాంచి కసితో బిజెపి అధ్యక్షుడు మండిపోతున్నట్లే కనిపిస్తోంది. ఇంతకీ అసలు చంద్రబాబు అంటే వీర్రాజుకు ఎందుకంత కసి ? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి ప్రశ్నలు వేయటం ఆలస్యం, వెంటనే సోము కూడా రంగంలోకి దిగిపోయి చంద్రబాబును ఎందుకు నిలదీసేస్తున్నట్లు ?




మొదటి నుండి చంద్రబాబు మీద బిజెపిలోని కొందరు నేతలకు బాగా మంటగా ఉందట. అటువంటి వారిలో వీర్రాజు కూడా ఒకడు. పార్టీకి ట్రూ ఫాలోయర్, స్ట్రాంగ్ సపోర్టర్ అయిన వీర్రాజుకు అనేక అంశాల్లో చంద్రబాబు అంటే మండిపోతోంది. అవేమిటంటే పార్టీని అవసరానికి వాడుకుని అవసరం తీరిపోగానే చంద్రబాబు దూరంగా విసిరేస్తున్న విధానాన్ని అధ్యక్షుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాగే మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా కమలంపార్టీని ఎదగనీయకుండా చంద్రబాబు తొక్కేశాడనేది అధ్యక్షుని ప్రధాన ఆరోపణల్లో ఒకటి. తమతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు వెన్నుపోట్లు పొడుస్తునే ఉన్నాడంటూ ఫైర్ అయిపోతుంటాడు.




అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు తాను వివిధ అంశాలపై ఎలా వ్యవహరించాడనే విషయాన్ని చంద్రబాబు మరచిపోతున్నాడు. వైసిపి హయాంలో దాదాపు అవే సీన్లు రిపీట్ అవుతుంటే ఫార్టీ ఇయర్స్ రెచ్చిపోతున్నాడు. దాంతో చంద్రబాబుపై ఎప్పటి నుండో అణిచిపెట్టుకునున్న మంటతో వెంటనే వీర్రాజు రెచ్చిపోతున్నాడు. తాజా ఉదాహరణనే తీసుకుంటే చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో రాత్రికి రాత్రే 36 గుళ్ళను కూల్చేశాడు. మళ్ళీ ఇంకెక్కడో కడతానని చెప్పాడు కానీ ఎక్కడా కట్టలేదు. అలాంటిది అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం రథం తగలబడిపోయిన అంశంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాడు. దాన్ని అవకాశంగా తీసుకుని వీర్రాజు వెంటనే చంద్రబాబుపై రెచ్చిపోయాడు.




అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నిస్తున్న చంద్రబాబుపై వీర్రాజు ఒంటికాలిపై లేచాడు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 7200 కోట్లకు ముందు లెక్కలు చెప్పమని తగులుకున్నాడు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని చంద్రబాబు ఆరోపించగానే వెంటనే వీర్రాజు రెచ్చిపోతు వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధుల్లో జరిగిన అవినీతి మాటేమిటి ? అంటూ రెచ్చిపోతున్నాడు. నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డాడంటూ చేసిన ఆరోపణలతో రాజకీయం వేడెక్కిపోతోంది. నిజంగానే చంద్రబాబుకు బిజెపినే నిజమైన ప్రతిపక్షమని సోమన్న మాటలతో దాడులు చేస్తు నిరూపించుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: