తెలుగుదేశంపార్టీకి 2050 వరకు అధికారానికి తిరుగులేదని పాపం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చాలా కలలే కన్నాడు. తాను తలకెత్తుకున్న కలల రాజధాని అమరావతి నిర్మాణమే అందుకు కారణమని చాలా గట్టిగా నమ్మారు. కానీ చివరకు ఏమైంది కన్న కలలన్నీ చివరకు కల్లలైపోయాయి. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఐదేళ్ళకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. ఎందుకింత అవస్తలు వచ్చిందంటే అందుకు కారణం అమరావతి నిర్మాణమే అని చెప్పాలి. తాను కలలు కన్న అమరావతి తనను ఎక్కడికో తీసుకెళుతుందని అనుకుంటే చివరకు ఘోరంగా తొక్కేస్తుందని చంద్రబాబునాయుడు కలలో కూడా అనుకునుండడు. అసలు ఇంతకీ ఏమి జరిగింది ?
ఏమి జరిగిందంటే మొన్న జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనే సమాధానం దొరుకుతుంది. దాదాపు 15 నిముషాల పాటు మాట్లాడిన చంద్రబాబు ’కావాలంటే 23 మంది ఎంఎల్ఏలమూ రాజీనామాలు చేసేస్తాం..మా పదవులన్నీ తీసేసుకోండి. రాజధానిగా మాత్రం అమరావతినే కంటిన్యు చేస్తామని ప్రకటించండి’ అంటూ జగన్మోహన్ రెడ్డికి బ్రతిమలాడుకున్నాడు. ఒక్క అమరావతి కోసం 23 మంది ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేయాలి ? అసలు అమరావతికి చంద్రబాబుకు అంత బాండేజ్ ఏమిటి ? లోకల్ సెంటిమెంట్ అనుకుంటే చంద్రబాబేమీ గుంటూరు జిల్లా వాసి కూడా కాదే. ఎక్కడో చిత్తూరు జిల్లా వాసికి అమరావతిలోనే రాజధాని ఉంచాలనే బలమైన కోరికేమిటి ?
ఇదే ప్రశ్న మామూలు జనాలకు అర్ధం కావటం లేదు. జగన్ మీడియా, ప్రభుత్వం ముందునుండి చెబుతున్నట్లు అమరావతిలో వేలాదిఎకరాలు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందా ? అనే అనుమానాలు బలపడిపోతున్నాయి. లేకపోతే అమరావతి కోసం తమ పదవులను వదులుకోవటానికి సిద్ధపడటం, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని కూడా చంద్రబాబు ఆలోచించకపోవటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని పై రెండు ప్రాంతాల్లోని నేతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా బహుశా చంద్రబాబు పట్టించుకునే స్ధితిని దాటిపోయినట్లున్నాడు. అమరావతి గురించి పదే పదే పట్టుబడుతున్న కొద్దీ జనాల్లో చంద్రబాబుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
చంద్రబాబుకు అమరావతిపై ఉన్నది మానసిక బంధమా లేకపోతే ఆర్ధిక సంబంధాలా అనే అనుమానాలు పెరిగిపోతుంటే జనాలకు నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. విచిత్రమేమిటంటే అమరావతిపై చంద్రబాబు ఇంతగా పట్టుబడుతున్నా గుంటూరు జిల్లాలోని టిడిపి నేతలు మాత్రం మాట్లాడటమే లేదు. అమరావతిపై ఇప్పుడే ఇంతగా గోల చేస్తున్న చంద్రబాబు రేపు రాజధాని అధికారికంగా వైజాగ్ తరలిపోతే ఏమైపోతాడో పాపం. మొత్తానికి ఒక్క అమరావతి కోసం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలను కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డాడంటే ఏమిటర్ధం ? చివరకు తాను నమ్ముకున్న అమరావతే చంద్రబాబును నిలువునా ముంచేస్తుందేమో ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి