క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. మామూలుగా ఎక్కడ ఎన్నికలు జరిగిన అజెండాను సెట్ చేసే కేసీయారే ఇపుడు బీజేపీ నేతల ట్రాపులో పడిపోయినట్లే అనిపిస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలే అజెండాగా ప్రచారం చేసుకోవాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికలంతా మతం చుట్టునే జరుగుతోంది. మతం ఆధారంగా ప్రచారం చేసుకోవటం వల్లే బీజేపీ ఎదుగుదల ఉందని ఆ పార్టీ నేతలు భావించటంలో వింతేమీలేదు. కానీ అదే విషయాన్ని పదే పదే టీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతుంటే ఏమిటర్ధం ? కమలంపార్టీలో పడిపోయారనే అర్ధం. టీఆర్ఎస్ తో పాటు మజ్లిస్ పార్టీని కూడా బీజేపీ నేతలు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీకి వేసే ప్రతి ఓటు టీఆర్ఎస్ కు వేసినట్లే కాబట్టి రెండు పార్టీలను జనాలు దూరంగా పెట్టాలంటూ బీజేపీ నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయిన టీఆర్ఎస్ తమకు మజ్లిస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవాల్సొస్తోంది.




ఎంఐఎంకు టీఆర్ఎస్ మధ్య ఎటువంటి పొత్తు కానీ అవగాహన కానీ లేదని కేటీయార్ చెప్పుకుంటున్నారంటేనే అర్ధమైపోతోంది టీఆర్ఎస్ ఎంత డిఫెన్సులో పడిపోయిందో. ఇక్కడ విచిత్రమేటంటే జీహెఛ్ఎంసి ఎన్నికలపై చర్చించేందుకు కేసీయార్ నిర్వహించిన సమావేశానికి మంత్రులు, కీలక నేతలతో పాటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కూడా హాజరయ్యారట. టీఆర్ఎస్ తో ఎంఐఎంకు సంబంధాలు లేకపోతే మరి అసదుద్దీన్ ఎలా హాజరయ్యారు ? ఎందుకు హాజరైనట్లు ? ఇక్కడే బీజేపీ నేతల ఆరోపణలు జనాల్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోయింది.  కమలంపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కేసీయార్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో కొంత సక్సెస్ సాధించినట్లే కనబడుతోంది. దుబ్బాక ఉపఎన్నికను చాలా తేలిగ్గా తీసుకున్న ఫలితమే ఇపుడు జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుభవిస్తోంది. టీఆర్ఎస్ కూడా తన ప్రచారంలో హిందువులు, మస్లింలు అని మాట్లాడుతోందే కానీ గడచిన ఆరేళ్ళల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోతోంది.  నిజానికి గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం చేసిన పెద్ద అభివృద్ధి కూడా ఏమీలేదు. నిజంగానే ప్రభుత్వం నగరాన్ని అభివృద్ది చేసుంటే మొన్నటి భారీ వర్షాలకు ఏమైందో అందరు చూసిందే.




భారీ వర్షాలకు కొన్ని వందల కాలనీలు నీళ్ళల్లో ముణిగిపోయాయి. వేలాది ఇళ్ళలోకి నీళ్ళొచ్చేశాయి. దాంతో రోజుల తరబడి చాలా ఏరియాల్లో కరెంటు కూడా లేదు. దీనికి తోడు నగరంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ తీవ్రత. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. అందుకనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీయార్ కానీ లేకపోతే తలసాని శ్రీనివాసయాదవ్ తదితర మంత్రుల ప్రచారంలో పెద్దగా స్పందన కనబడటం లేదు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి కూడా కేసీయార్ మీద చాలా ప్రభావం చూపినట్లే కనబడుతోంది. అందుకనే నరేంద్రమోడి మీద యుద్ధమని కేసీయార్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటివారం తర్వాత నాన్ బీజేపీ ప్రభుత్వాలు, కీలక నేతలతో హైదరాబాద్ లో సమావేశం పెడతానని చెబుతున్నారు. ఇదంతా కేసీయార్ లోని అసహనాన్నే చూపుతున్నది.  మొత్తంమీద తెలంగాణాలోని  భవిష్యత్ రాజకీయాలకు గ్రేటర్ ఎన్నికలు ఓ కొలమానంగా నిలవబోతోందనటంలో సందేహం లేదు. చూద్దాం చివరకు ఏమవుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: