ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఫాలో అయితే అంతే సంగతులంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. బహుశా ఆరేళ్ళ సహవాసంతోనే అవంతి ఈమట చెబతున్నట్లున్నారు. ఇప్పుడంటే అవంతి వైసీపీ తరపున భీమిలిలో గెలిచి మంత్రయ్యారు కానీ ఒకపుడు ఈయన కూడా చంద్రబాబు ఫాలోవరే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫాలోవరే కానీ గుడ్డిగా చంద్రబాబు స్క్రిప్ట్ ను మాత్రం ఫోలో అవ్వలేదట. అందుకనే చివరినిముషంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఎంఎల్ఏగా గెలిచి మంత్రికూడా అయిపోయారు. ఇంతకీ అవంతి ఎవరిని గురించి చెప్పారో తెలుసా ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గురించే.




బాగుంది కదూ అధికారపక్షంలోని మంత్రి ప్రతిపక్ష రాష్ట్ర అధ్యక్షుడిని చంద్రబాబు గురించి హెచ్చరించటం. వీర్రాజుకన్నా ముందు అధ్యక్షుడుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ గుడ్డిగా చంద్రబాబు స్ర్కిప్ట్ ను ఫాలోఅయిపోయే తొందరలోనే అధ్యక్షపదవిని పోగొట్టుకున్నారంటూ అవంతి వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే చంద్రబాబు చివరినిముషంలో అయినా తన స్క్రిప్ట్ ను మార్చేసుకుని సేఫ్ అయిపోతారని కానీ ఆయన స్క్రిప్ట్ ను గుడ్డిగా ఫాలోఅయిన వారుమాత్రం కన్నా లాగే బలైపోవటం ఖాయమని మరీ మరీ చెబుతున్నారు అవంతి. మతపరమైన రాజకీయాల విషయంలో కొత్తగా చంద్రబాబు నానా గోల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఏరోజు కూడా టీడీపీ హిందుత్వ రాజకీయాలను భుజానేసుకున్నది లేదు. అలాంటిది హఠాత్తుగా చంద్రబాబు తన రూటును మార్చేసి దేవాలయాలపై దాడుల విషయంలో నానా గోల చేస్తున్నారు.




చంద్రబాబు ఎప్పుడైతే దేవాలయాలపై దాడులను వాడుకుంటున్నారని అనుకున్నారో వెంటనే సోమువీర్రాజు హడావుడిగా గోల మొదలుపెట్టేశారు. హిందుత్వ రాజకీయాలపై బీజేపీకి మాత్రమే పేటెంట్ ఉందనుకున్నారో ఏమో గానీ చంద్రబాబుకు మించి వీర్రాజు గోల మొదలుపెట్టేశారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి కపిలతీర్ధం టు రామతీర్ధం అంటూ ఓ యాత్రకు రూటు కూడా రెడీ చేసేసుకున్నారు. మొత్తం 8 రోజులు సాగే ఈ తీర్ధాల యాత్రలో అనేక గుళ్ళను టచ్ చేయబోతున్నట్లు వీర్రాజు ప్రకటించారు. నిజానికి రాష్ట్రంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, రథయాత్రలు చేయటం అనే కాన్సెప్టు లేదనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఎందుకిదంతా వచ్చేసిందంటే చంద్రబాబు పుణ్యమేనంటున్నారు అవంతి. మతపరమైన రాజకీయాలను చంద్రబాబు భుజానికెత్తుకోగానే వీర్రాజు కూడా హడావుడిగా మొదలుపెట్టేశారని అవంతి క్లారిటి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: