
నా అంత తెలుగు మీ ఎవ్వరికీ తెలియదు..అని అంటున్నాడు ప్రకాశ్ రాజ్.. అలా అనడం వెనుక ఆయనకు రెండు శక్తులు పనిచేయొచ్చు. ఒకటి పవన్ కల్యాణ్, ఇంకొకటి చిరంజీవి. వీళ్లిద్దరి సాయంతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పకపోయినా ప్రకాశ్ రాజ్ ఆకాశవాణి రేడియోలో ప్రసంగం వినిపించిన విధంగా మాట్లాడి మాట్లాడి మన బుర్రలు అరగ్గొడుతూనే ఉంటాడు. ఆయనకు ఆ పాటి స్వేచ్ఛను చలం ప్రసాదించి ఉంటాడు. గుడిపాటి వెంకటా చలం అని చాలా పెద్ద రైటర్ ఉండేవారు. ఆయనకు, నాకూ బాగా తెలిసిన వాడు అందుకే నా వెనుక చలం ఉన్నాడు అని కూడా చెప్పాడు. బాగుంది ఇలా చెప్పడంతో ప్రకాశ్ రాజ్ నచ్చేడు. లేకపోతే నచ్చేవాడు కాదు. చలం మంచివాడు. స్త్రీ స్వేచ్ఛ కోరాడు. ప్రకాశ్ రాజ్ ఇంకా మంచి వాడు.. స్త్రీ స్వేచ్ఛతో పాటు పురుషులకూ స్వేచ్ఛ కూడా కావాలని అనకుండా అంటాడు. ఎదుటి వాడు అనకుండానే ఏదో ఒకటి చెబుతాడు.. ఆ చెప్పడంలో అహంకారం ఉంది అని మనం అనుకోవాలి. అవును! నేను మీరు చెప్పడంలోనే అహంకారం ఉండి ఉంటుంది. అహం అనగా అంతా నేను అన్నీ నేనే అన్న భావనలో ఉన్న కాంట్రవర్శీ. నేను వివాదాలను కోరుకోను కానీ వివాదం అంటే చాలా ఇష్టపడతాను. వివాదం కారణంగా ఆ పూట నాకు మనశ్శాంతి లేకపోయినా కప్పు టీతో నా జీవితాన్ని ఎలా నెగ్గుకు రావాలా అన్న ఆలోచన ఒకటి ఎప్పుడూ వివాదమే ఇచ్చింది. ఇప్పుడూ ఇస్తుంది. ఆ విధమ్మున లేదా ఆ రిథమ్మున నా స్వేచ్ఛను తాకట్టు పెట్టే వివాదాలు నేను కోరుకోలేదు. కానీ ప్రకాశ్ రాజ్ లాంటి మంచి ఆర్టిస్టుతో వివాదం నాకెంతో ఇష్టం..ఆయన కూడా కొన్ని పదాలు తప్పు పలుకుతారు. అయినా ఇష్టమే. ఆయన కారణంగా, విష్ణు కారణంగా, మోహన్ బాబు కారణంగా, చిరంజీవి కారణంగా తెలుగుకు జరిగిన మంచి నాకు తెలియదు. నా కారణంగా తెలుగుకు జరిగిన చెడు ఏమీ లేదు. ఎందుకంటే నా కారణంగా తెలుగు మంచి ప్రవాహ ధోరణిలో ఉంది కనుక నా వల్ల చెడు అన్న పదానికి చోటే లేదు. అలా అని నేనే తెలుగు బడిని బండి రా వరకూ నడుపుతున్నానా చెప్పండి.. తెలివి తక్కువ ప్రసంగాలు ఇవ్వకూడదు ప్రకాశ్ రాజ్. ఆ మాటకు వస్తే మా వర్ణమాలలో తీసేసిన అక్షరాలు నీకు తెలుసునో లేదో అన్న సంగతి నాకు తెలియదు. ఆ విధంగా నేను తెలుగు విషయమై చిన్నవాణ్ని. తెలుగు తెలిసిన వాళ్లకు వచనార్థం, వాక్యార్థం తెలియకపోయినా నా గురించి తెలియక పోయినా వచ్చిన నష్టం కానీ చెడు కానీ లేదు.
అందుకని నీవు తెలుగు మాస్టారి అవతారంలో మా విష్ణు బాబు గెలిచాక నాలుగు పాఠాలు చెప్పు. వీలుంటే రంగనాయకమ్మ తెలుగు వాచకం మాత్రం తప్పక కొనుగోలు చేయు. ఎందుకంటే రంగనాయకమ్మ సాహిత్యం కన్నా ఆమె రూపొందించిన ఒకటో తరగతి వాచకం వంద రెట్లు బాగుంటుంది. కనుక కొనుగోలు చేయు. నేను కూడా మొన్ననే కొనుగోలు చేసి మా తెలంగాణ పల్లెకు పంపి వచ్చాను. మళ్లీ చెబుతున్నాను విష్ణు తెలుగు తప్పు పలికినా, నువ్వు మంచి భాష పేరిట తప్పుడు ప్రసంగాలు చేసినా నా తెలుగుకు వచ్చిన చెడు కానీ మంచి కానీ లేవు కదా! కనుక హాయిగా నిద్రపోండి .. ఏం కాదు.. మీ ఆరోగ్యానికి మరియు విష్ణు బాబు ఆరోగ్యానికి ఇంకా మోహన్ బాబు ఆరోగ్యానికి, చిరంజీవి ఆరోగ్యానికి ఇంకా ఇతర నటుల ఆరోగ్యానికి ఎంతో మేలు తప్పక ఉంటుంది. తెలుగుకు మీరు చేసే సాయం ఇదొక్కటే అయితే మేలు.. ఇది కాకపోయినా మేలే! మీ పిల్లలు పలికే తెలుగు కారణంగా మీ మరియు మా తెలుగుకు వచ్చే నష్టం కన్నా కలిగే చెడు పైనే రేపు చర్చిద్దాం.. సరేనా! శుభాకాంక్షలు
అందరికీ అనగా మా సభ్యులు అందరికీ అని అర్థం.
- రత్నకిశోర్ శంభుమహంతి