ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి. రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం. అసలు భోగి అంటేనే  సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. భోగి అంటేనే భోగమయిన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంత సంపన్నమైన పండగ మరొకటి లేదని నిరూపిస్తుంది.


పూర్వం ఈ సమయానికి పంటలన్నీ చేతికి వచ్చి గాదెలు నిండి లోగిలి ధాన్య రాసులతో నిండి నిండు చూలాలులా ఉండేది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన.

గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలి కాచుకుంటూ పరమానందం చెందుతారు. ప్రతి పండగ వెనక పరమార్ధం, లౌకికం ఉంటాయి. మనవలందరూ ఇంటికి చేరడంతో తాతయ్యలకు, అమ్మమ్మలకు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే వారికి రెట్టింపు ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఎక్కడేక్కడో ఉన్న వారంతా ఈ సంధర్భంగా ఒకచోటికి చేరుకుని, సంబరాలు చేసుకోవటం, ఇంటిల్లిపాదీ ఒకరినొకరు ఆట పట్టించుకోవటం... ఇవన్నీ వారికి నూతన శక్తినిస్తాయి. మళ్లీ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. అసలు పండగల వెనక ఉన్న పరమార్ధమే ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: