దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ అధికారులు కరోనాను ఎదుర్కొనేందుకు పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా టీటీడీ భక్తులు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే విధానానికి స్వస్తి పలికింది. 
 
శ్రీవారి భక్తులకు టీటీడీ టైమ్ స్లాట్ కేటాయించి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా టీటీడీ మహాయాగం చేపడుతోంది. ఈ నెల 19వ తేదీ నుండి 21 వరకు శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతర మహాయాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇకపై కరోనా ఎఫెక్ట్ ఉన్నన్ని రోజులు భక్తులు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేదు. 
 
ఎక్కువ మంది ప్రజలు ఒకేచోట గుమికూడితే అక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకు అవకాశం కల్పించకుండా టీటీడీ తాత్కాలికంగా క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉండకుండా చర్యలు చేపట్టినట్లు ప్రకటన వెలువడింది. టీటీడీ శ్రీవారికి నిత్యం జరిగే కొన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసిందని సమాచారం. 
 
ప్రతి సోమవారం ఉదయం జరిగే విశేష పూజ, మధ్యాహ్నం వేళ జరిగే వసంతోత్సవం, బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. భక్తులు టోకెన్లు ఇచ్చి నేరుగా ఆలయంలోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో చెబుతున్నారు. ఒక గంటలో దాదాపు 4000 మంది భక్తులను అనుమతించేలా ప్లాన్ చేస్తున్నామని ఈవో మీడియాకు తెలిపారు. వచ్చే మంగళవారం నుండి టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అమలులోకి రానున్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: