
అలాంటి హనుమంతుడిని పూజించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని అంటుంటారు. అందువలన హనుమంతుడిని ఆరాధించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఆయన ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఇక అనేక క్షేత్రాలలో కొలువుదీరి ఆంజనేయుడు.. అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి ఆలయాలలో ఒకటి వనస్థలిపురం శారదానగర్ లో పంచముఖి హనుమ ఆలయం. పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. అయితే భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమె ఈ పంచముఖి ఆలయాలు వున్నాయి.
వనస్థలిపురం శారదానగర్ లో ప్రాశాంతంగా కనిపించే ఈ ఆలయంలోని హనుమ మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ దర్శనమిస్తారు. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనమైన ఒంటె దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో నవగ్రహా మంటపం, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు కొలువుదీరి ఉంటారు. మంగళవారమే కాదు.. ప్రతి రోజు స్వామివారిని భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఆంజనేయుడికి పూజలు, అభిషేకాలు జరిపించడం వల్ల ఆపదలో ఆదుకుంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అనారోగ్యాలు, ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుందని అంటారు. మానసిక పరమైన చీకాకుల నుంచి దూరమై ప్రశాంతతను పొందడం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన, సకల శుభాలు చేకూరుతాయని భక్తులు నమ్మకం. ఈ పంచముఖి హనుమ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి.