మన తెలుగువారి పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఆయా పండుగలకు చేసే పూజలు, పూజా విధానాలు ఇలా ప్రతి విషయంలోనూ విభిన్నత కనిపిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం పండుగ అయిన ఉగాదిని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆరోజున తెలుగు వారు అందరూ ఆది పచ్చడి తిని రోజు ప్రారంభిస్తారు. ఇక ఈ రోజు దేశం మొత్తం శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే శ్రీరామనవమి రోజు పానకం వడపప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పానకం వడపప్పు ని ప్రసాదం గా ఈ రోజు తింటూ ఉంటారు. అయితే దీని వెనుక కూడా కొన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. 

శరదృతువు, వసంత రుతువు యముడు కోరలు లాంటివి అని దేవీభాగవతం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తీసుకునే ప్రసాదంలో కూడా ఆరోగ్య విలువలు ఉండేలా చూసుకుంటారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత అన్ని వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఇది ఒక రకంగా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదీకాక పానకం అనేది శ్రీరాముడి అంశకు మూలం అయిన మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. 

అలాగే వడపప్పు కోసం వాడే పెసరపప్పు శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణ శక్తిని అభివృద్ధి పరిచి దేహకాంతి పెంచుతోంది. అలాగే పెసరపప్పు జ్ఞానానికి ప్రతీకగా కూడా చెబుతారు. ఎండలు బాగా ముదిరి పోతున్న రోజుల్లోనే శ్రీరామ నవమి వస్తుంటుంది. ఆ ఎండలో ఎండ వేడి దెబ్బ కొట్టకుండా ఈ వడపప్పు కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసం కలుగుతుందని చెబుతుంటారు పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి: