క‌రోనా నేప‌థ్యంలో ఈసారి వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు గ‌తంలో జ‌రిగిన విధంగా జ‌ర‌గ‌డంలేదు. అయినా, ఎదో విధంగా విఘ్నేశ్వ‌రుడిని పూజిస్తున్నారు. భ‌క్తులు పోయిన సారికంటే ఈ సారి వినాయ‌క మండ‌పాలు పెరిగే అవ‌కాశం ఉంది. ఏ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టినా ముందుగా గ‌ణ‌ప‌తికి పూజ చేయ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది. మ‌రి అలాంటిది ఆ విఘ్నేశ్వ‌రుడి పూజ ప్ర‌త్యేకం మ‌రి. గ‌జ‌ముఖుడి పూజ‌లో ముఖ్యంగా 21 ర‌కాల ప‌త్రుల‌ను వాడుతారు. ఆ ఆకులు ఏంటో తెలుసుకుందాం.


1. మాచీ పత్రం : మాచీ పత్రి అనేది సంస్కృతం పేరు. చేమంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసనను వెద‌జ‌ల్లుతాయి. ఇవి చేమంతి ఆకుల లాగా ఉంటాయి.

2. దూర్వా పత్రం : దూర్వా పత్రం అంటే గరిక అని అర్థం. గ‌రిక రెండు ర‌కాలుగా ఈ గ‌డ్డి జాతి మొక్క‌లు తెల్ల గరిక, నల్ల గరికలు ఉంటాయి. దుర్వా ప‌త్రం ఏక‌దంతునికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌వి.


3. దుత్తూర పత్రం : ఉమ్మెత్త‌ను సంస్కృతంలో దుత్తూర పత్రం అంటారు. వంకాయ జాతికి చెందిన ఆకులు ఇవి. వంకాయ రంగుతో ఉన్ ముళ్ల‌కాయ‌లు ఉంటాయి.

4. అపామార్గ పత్రం : ఈ ప‌త్రాన్ని తెల‌గులో ఉత్త‌రేణి ఆకు అని పిలుస్తారు. దీని ఆకులు గుండ్రంగా ఉండి, గింజ‌లు ముళ్లు క‌లిగి ఉంటాయి.

5. బృహతీ పత్రం : దీనిని ములక అని పిలుస్తారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలుంటాయి.  ఈ ఆకులు వంగ ఆకులను పోలి ఉంటాయి.

6. బిల్వ పత్రం : మారేడు ఆకునే బిల్వ ప‌త్రం అంటారు. మూడు ఆకులతో ఒక ప‌త్రంగా ఉంటుంది. ఇది ప‌ర‌మ‌శివుడికి, శ్రీ మ‌హాల‌క్ష్మికి ప్రీతిపాత్ర‌మ‌యిన‌విగా చెబుతారు.

7. తులసీ పత్రం :   తుల‌సీ ద‌ళాల‌ను, ఆకుల‌ను హిందువులు అన్ని పూజ‌ల‌లో వాడుతారు. ప్ర‌తి ఇంటి ఆవ‌ర‌ణ‌లో తుల‌సీ చెట్టు ఉంటుంది. పూజ‌కే కాకుండా ఆయుర్వేదంలో తుల‌సీ ఆకుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది.

8. చూత పత్రం :  చూత ప‌త్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు అన్ని శుభకార్యాల్లో విశిష్టంగా వాడుతారు. ఏ పండుగ‌యిన గృహాల్లో మామిడి తోర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే.

9. బదరీ పత్రం : బదరీ పత్రం అంటే రేగు ఆకు అని అర్థం. మూడుర‌కాల రేగు, జిట్రేగు, గంగరేగు అని ఉంటాయి.

10. శమీ పత్రం : శ‌మీ వృక్షాన్ని జ‌మ్మి చెట్టు అని అంటారు. ఈ శ‌మీ ఆకుల‌ను ద‌స‌రా రోజు ప్ర‌త్యేకంగా వాడుతారు.

11. కరవీర పత్రం : దీనినే గన్నేరు ఆకు అని పిలుస్తారు. ఈ చెట్టుకు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పుష్పాలు ఉంటాయి.
 
12. విష్ణుక్రాంత పత్రం : ఈ ప‌త్రం చెట్టుకు నీలం, తెలుపు పువ్వులుంటాయి.  నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత మొక్క‌ అంటారు.

13. మరువక పత్రం :  ఈ ఆకును ధవనం, మరువం అని పిలుస్తుంటారు.  ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం వీటి విశిష్ట‌త‌.

14. సింధువార పత్రం : సింధువార పత్రాన్నే వాడుక భాష‌లో వావిలి అని కూడ పిలుస్తారు.

15. అశ్వత్థ పత్రం : రావి చెట్టు ఆకుల‌ను అశ్వత్థ పత్రం అని పిలుస్తారు. రావి చెట్టుకు పూజలను ప్ర‌త్య‌కంగా చేస్తారు.

16. జాజి పత్రం : ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క ఆకు. వీటి పువ్వుల ద్వారా సుగంధ తైలం తీస్తారు.

17. అర్క పత్రం : జిల్లేడు ప‌త్రాల‌ను అర్కం అంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం ఉంటుందని పెద్ద‌లు చెబుతారు.

18. అర్జున పత్రం :  అర్జున పత్రలాను వాడుక భాష‌లో మ‌ద్ది ఆకులు అంటారు. ఇవి మర్రి చెట్టు ఆకుల్ని పోలి ఉంటాయి. ఈ పెద్ద వృక్షాలు అడవులలో పెరుగుతాయి.

19.. దాడిమీ పత్రం :  దాడిమి ప‌త్రాన్ని దానిమ్మ‌క ఆకు అంటారు.

20. దేవదారు పత్రం :  దేవ‌దారు ప‌త్రాలు దేవతలకు అత్యంత ఇష్టమైనవి చెబుతారు. ఈ దేవ‌దారు వృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. వీటిని కూడా వినాయ‌క పూజ‌లో పెడుతారు.

21. గండలీ పత్రం : దీనినే లతాదూర్వా ఆకు అని అంటారు.

 
ఈ 21 పత్రాలతో గణేష్ చ‌తుర్థి రోజు వినాయ‌కుడిని పూజిస్తే  సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని న‌మ్మ‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి: