టికెట్ లేదా ?... నో ఎంట్రీ
 తిరుమల  శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చేయ‌వ‌ల‌సిన భద్రత ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో  గోపినాధ్‌జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ   వెంక‌ట‌ప్ప నాయుడుతో క‌లిసి శ‌నివారం స‌మీక్షించారు. తిరుమలలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి విజిలెన్స్, పోలీస్ అధికారుల‌తో స‌మీక్ష సమావేశం జ‌రిగింది.  

ఈ సందర్భంగా సివిఎస్వో గోపినాధ్‌జెట్టి మాట్లాడుతూ గ‌త ఏడాది సెప్టెంబ‌రులో వార్షిక‌, అక్టోబ‌రులో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన‌ట్లే ఈ ఏడాది కూడా  వేంకటే శ్వర స్వామి  బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. గ‌త ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా వివిధ‌ రాష్ట్రాల నుండి ర‌వాణా సౌక‌ర్యాం లేద‌ని, అందువ‌ల‌న త‌క్కువ సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని చెప్పారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల స‌డ‌లింపులు ఉన్న కార‌ణంగా  క్రిందటి సంత్సరం కన్నా ఎక్కువ మంది భ‌క్తులు వ‌స్తార‌న్నారు. కావున ఈ బ్ర‌హ్మోత్ప‌వాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాల‌న్నారు. దర్శన టికెట్లు   కలిగిన భక్తులందరూ టీటీడీ సూచించిన మేరకు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, రెండు డోసుల టీకా మందు  వేసుకున్నట్లు సర్టిఫికెట్లు కానీ,  72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న కోవిడ్ నెగటివ్ రిపోర్టు ఖచ్చితంగా తీసుకువస్తేనే అలిపిరి  వద్ద అనుమతించాలని ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా అక్టోబ‌రు 11వ తేదీ గ‌రుడ సేవ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు చెప్పారు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభింస్తారని చెలిపారు. దీంతో మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ ఏర్పాట్లు చేయాల‌న్నారు.

అనంత‌రం అర్బ‌న్ ఎస్పీ మాట్లాడుతూ అలిపిరి, ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నం, శ్రీ‌వారి ఆల‌యం,  బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బూంది పోటు, తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన‌ కూడ‌ళ్ల‌లో అద‌న‌పు పోలీస్ సిబ్బందిని, శీఘ్ర ప్రతి స్పందన బృందాలు (క్విక్ రెస్పాన్స్ టీంలు), రెస్కూటీంలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎస్ఎస్‌డి, రూ.300- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు క‌లిగిన భ‌క్తుల‌ను మాత్ర‌మే అలిపిరి వ‌ద్ద అనుమ‌తించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అందరూ స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ స‌మీక్ష‌లో అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, తిరుమ‌ల అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య‌, విజివోలు బాలిరెడ్డి,  మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: