సమస్త ప్రపంచం ఇప్పుడు ప్రశాంతి నిలయం వైపు చూస్తోంది. కారణం: మన ప్రియతమ సద్గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు! రాష్ట్రపతి, ప్రధాని నుంచీ సాధారణ భక్తుడి వరకూ... దేశవిదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. గతంలో బాబా దర్శనం ఇచ్చే చోట ఉన్న ఆయన ప్రతిమమూర్తిని దర్శించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఆయన చేసిన అద్భుత సేవలను స్మరించుకుంటున్నారు. నిజంగా, బాబా సేవలు సామాన్యమైనవి కావు. అవి ఏకంగా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు! దేవుడే దిగివచ్చి సేవ చేశాడంటే అతిశయోక్తి కాదు. తాగునీరు-విద్య-వైద్యం: నిస్వార్థ సేవలో ఆయనే దేవుడు! బాబా సేవల్లో అగ్రస్థానంలో నిలిచేది "శ్రీ సత్యసాయి తాగునీటి పథకం". అప్పట్లోనే దాదాపు రూ. 300 కోట్లకుపైగా ఖర్చు చేసి... అనంతపురం జిల్లాలోని దాదాపు 750 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించారు.
 

ఇది ఒక చరిత్ర సృష్టించిన రికార్డు! ఇక, పుట్టపర్తి, బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లలో నెలకొల్పిన శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గుండె, మెదడు, కిడ్నీ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేస్తూ వందల కోట్ల మందికి ప్రాణదానం చేశాయి. గత 15 ఏళ్లలోనే ఈ రెండు ఆస్పత్రుల్లో 35 లక్షల మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందాయంటే, ఆ సేవ విస్తృతిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, శ్రీ సత్యసాయి విద్యా విహార్ వ్యవస్థ కింద దేశవ్యాప్తంగా 100కు పైగా పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. విద్య, వైద్యం, నీరు... ఈ మూడు ప్రాథమిక అవసరాలను నిస్వార్థంగా అందించిన బాబా సాక్షాత్తూ దైవమే!



పుట్టపర్తికి కొత్త రూపం: సత్యసాయి ప్రభావం! .. నేడు పుట్టపర్తికి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానం ఉందంటే, దానికి ఏకైక కారణం సత్యసాయిబాబా. 1990లోనే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కావడం, ఆయన దర్శనం కోసం విదేశీ విమానాలు క్యూ కట్టడం ఆ రోజుల్లో ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మోడరన్ టౌన్‌గా పుట్టపర్తిని తీర్చిదిద్దిన ఘనత బాబాదే. ప్లానెటేరియం, మ్యూజియం, రైల్వే స్టేషన్, అంతర్జాతీయ స్థాయి స్టేడియం వంటి సౌకర్యాలు అన్నీ ఆయన దార్శనికతకు నిదర్శనం. బాబా విదేశాలకు వెళ్లకపోయినా (ఒక్కసారి ఆఫ్రికా మినహా), కేవలం పుట్టపర్తి లేదా వైట్‌ఫీల్డ్ ఆశ్రమంలోనే ఉండి కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్నారు.



అంతుచిక్కని ప్రశ్న: నిధుల రహస్యం! .. అయితే, వందలు, వేల కోట్ల రూపాయలతో ఈ సేవ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అవసరమైన నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నది సామాన్యుడికి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. రాజకీయ నాయకులు, అక్రమ సంపాదనాపరులు తమ సొమ్మును బాబా వద్ద దాచారన్న ఊహాగానాలు నిజం కాలేదు. ఇంత భారీ కార్యక్రమాలు చేపట్టడానికి ఏ సంస్థలు, ఏ భక్తులు, ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చారు అన్నది ఇప్పటికీ ఒక రహస్యమే. ఏదేమైనా, ధర్మ సక్రమమో, అక్రమమో... అలా పోగైన సొమ్ము అంతా తిరిగి పేద ప్రజల సేవకే ఉపయోగపడిందన్న సంతృప్తి కోట్ల మంది భక్తులకు, సామాన్య ప్రజలకు ఉంది. ఈ శత జయంతి సందర్భంగా, సత్యసాయి అందించిన మానవసేవ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: