పూర్వము సోమయాజులవారి సోమిదేవమ్మ మాఘాధవారముల నోము పట్టి ఐదేండ్లు నియమము పాటించి ఉద్యాపనము దీర్చికొను సమయంబున కథవినెడువారు లేక కుమారులను పిలిచి మాఘాదివారముల నోము కథ వినరండిరా అనగా వారు రాజుకొలువనకు వెళ్ళుటకు ఆలస్యమగుచున్నదని వెడలిపోయిరి. వీధిన పోయే బాలురను పిలచి మాఘాదివారముల నోముకథ వినండిరా అనగా వారు మేము ఆడుకొనవలనని దూరముగ పోయిరి. నీలాటి రేవునకుబోవు అమ్మలక్కలను పిలిచి మాఘాదివారముల నోము కథ వినండి అనగా వారు మాకింటిలో పని ఉన్నదని తొందరగా పోయిరి.

          ఇంతలో నిండు గర్భము ధరించియున్న రమాదేవి ఎచటకో పోవుచు అటు రాగా సోమిదేవమ్మ ఆమెను గూడ పిలిచి మాఘాదివారముల నోము కథ వినిపొమ్మనగా ఆమె అమ్మా! నాకింత అన్నము బెట్టినచో నేను కథ వినెదనన్నది. సోమిదేవమ్మ సరేరమ్మని లోపలకు పిలిచి, స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకు బెట్టి తానును తినిన తరువాత కథ చెప్పుచుండగా ప్రాలు మాలికచేయలసియున్న రమాదేవి నిద్రపోసాగినది. అప్పుడామె కడుపులోని శిశువుకథ "ఊ" కొట్టుచుండ సోమిదేవమ్మ కథ చెప్పుట ముగించి ఆమె పొట్టమీద అక్షింతలు వేసికొని తాను తలమీద వేసికొను నంతలో రమాదేవి నిద్రలేచనది.

          నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ! నీవు నిద్రలో యుండగ నీ కడుపుననున్న బిడ్డ నా నోముకథ వినినది. నీకు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన గురియును. ఆడబిడ్డ పుట్టిన ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడవచ్చెదను. మి ఇంటి గుర్తులు చెప్పుమని తెలిసికొని యామెను తిరిగి పంపెను.

          కొంతకాలమునకు ముత్యాలవాన కురియగ సోమిదేవమ్మ రమాదేవికి స్త్రీ శిశువు కలిగినట్లు తెలిసికొని ఊయల చీర, ఉగ్గుగిన్నె తీసుకొనిపోయి పురిటిబిడ్డకు నీళ్ళుపోసి ఉగ్గుపెట్టి, చీర చెట్టుకొమ్మకు కట్టి ఊయలలో పరుండ జోలపాడి, దీవించి, పాడియావునిచ్చి యింటికి వచ్చెను. రమాదేవి పనికిపోయినది. ఆ మార్గమున బోవుచున్న రాజు పసిపాపను చూచి ఆమె మాహాలక్ష్మి అంశముగల చిన్నది. రాజాంతఃపురములలో నుండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవి వచ్చినదాక కాచుకొనియుండి. "అమ్మా! నీవింక మా రాజభవనమున నుండవచ్చునని తనవెంట గొనిపోవుచుండ దారిలో యెండిపోయిన చెట్లు చిగురింపసాగినవి. ఇంకిపోయిన కుంటలు నీటితో నిండినవి. ఎదురైన గొడ్రాళ్ళకు బిడ్డలు కలిగిరి.

          కొన్ని దినములకా పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడామెను ప్రేమించి రెండవభార్యగ వివాహమాడి అనురాగముగా చూచుచుండెను. రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే రమాదేవి కుమార్తె యొక్క ఏడు వారముల నగలు అపహరించి, నదిలో పారవేయించినది. కాని నదిలోని ఒక చేప ఆ నగలు గల భరిణెను మ్రింగినది. ఆ చేప జాలరులకు  చిక్కినది. జాలరులా చేపనే తెచ్చి యువరాజుగారికిచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూరచేయమనుచు చిన్న భార్యయింటి కంపెను. చిన్న భార్య చేపను కోయించుండగా భరిణె బైటపడి పోయిన నగలు దొరికినవి.

ఆ నగలు అన్నిటిని అలంకరించుకొని రాజుకు కబురుచేసినది. రాజువచ్చి చిన్న భార్య అలంకారము చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పుటకొరకు అంతఃపురమునకు వెళ్ళెను. పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏవిధముగానైన చంపవలెనని తలచెను. ఒకనాడు చిన్న భార్యను విందుకు పిలిచి పాయసములో విషము కలిపి చంపబోవుచుండగా రాజు కూడ భోజనమునకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక త్రాగి మృతి నొందెను. భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తానుకూడా సహగమనము చేయ నిశ్చయించుకొనెను. ఇద్దరు భార్యలు బైలుదేరిపోవు చుండగా శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణరూపమున ఎదురువచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగెను. భర్తతో సహగమనము చేయుటకు వెళ్ళుచున్నామని చిన్నభార్య చెప్పెను. అది విని 'సౌభాగ్యవతీభవ' అని దీవించి అంతపని జరుపునీకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళుయిచ్చి నీవు కాళ్లు గడుగుకోమనెను. ఆమె అట్లె చేసెను తరువాత నాకు దాహం యిచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దుఃఖించుచున్నాను. దాహము పుచ్చుకొనుట ధర్మముకాదనెను. ఆ బ్రాహ్మణుడు నీ భర్త ఏమీ మరణించడు. నేను చెప్పినట్లు చేయుము అనెను. ఆమె ఆ విధముగా చేసెను. ఆ బ్రాహ్మణడు తనకు తలంటి నీళ్లుపోసి గంధము ఇవ్వమని అడిగి ఆమెకూడ తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులకు ఆమెకూడా భయపడి స్వామీ! భర్త చనిపోయిన దుఃఖముతో కాళ్లుకడుగుకొని కాళ్ళు దాచుకున్నాను. దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను. పసుపు రాసుకొని ముఖమెట్లు దాచగలనని ప్రశ్నించినది. అందులకు  ఆ బ్రాహ్మణుడు 'సౌభాగ్యవతీభవ' నీకు ఎందుకమ్మా, అంత భయం నేను చెప్పినట్లుగా చేయమనెను. అంత నామె అట్లే చేసెను. తరువాత ఆమె అతడు చెప్పినట్లు అతనికి బొట్లుపెట్టి తాను కూడా బొట్టుపెట్టుకొని అతనికి భోజనము పెట్టి తాను కూడా భోజనము చేసి అతనికి తాంబూలమిచ్చి, తాను కూడా తాంబూలము వేసికొని ఆ బ్రహ్మాణుని పాదాలకు నమస్కరించగా అంత ఆ బ్రహ్మణుడు శ్రీమహావిష్ణువుగా మారి అమ్మా నీ భక్తికి మెచ్చితిని, నీవు తల్లిగర్భమున ఉన్నప్పుడు మాఘాదివారముల కథవిని పవిత్రురాలవై నావు. నీకు ఏమికావాలో కోరుకొనుము ఇచ్చెదననెను. ఆమె సంతోషించి తనకు పతిభిక్ష పెట్టమని కోరెను. అంత విష్ణుమూర్తి అట్లేయని అక్షింతలు యిచ్చి నీ భర్త శవంమీద చల్లమని చెప్పి అదృశ్యుడయ్యెను. తరువాత ఆమె అక్షింతలు తీసుకొని భర్తశవం దగ్గరు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్తమీద అక్షింతలు చల్లగ నిద్రనుండి లేచినట్లు లేచెను. అది చూచి అక్కడున్నవారంతా ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివమ్మాయని అడిగిరి.

          అందుకు ఆమె నేను ఏ నోమూ నోచలేదు, ఏ వత్రము చేయలేదు. మాఘపౌర్ణిమకు ముందువచ్చు రథసప్తమి నాడు మాఘాదివారం నోముపట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా, ఆ కథ నేను విన్నఫలమే గాని, నేచేసిన ఫలము కాదని చెప్పెను. అక్కడున్నవారంతా ఆహా! నోము కథ విన్నంత మాత్రముననే యింత మహాత్య్మము ఉన్నది. నోము నోచుకున్నచో ఇంకెంత మహాత్య్మము ఉంటుందోనని అప్పటి నుండి ఈ నోము ప్రతివారం నోచుకొనుచున్నారు. రాజు తన ఇద్దరి భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా నుండెను.

ఉద్యాపనము:- ఈ నోముపట్టి అయిదుపండ్లు ఉద్యాపనము చేయవలెను. మొదటి రోజు పాలు త్రాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తయిదువులకు భోజనము పెట్టవలెను. రెండవ రోజు మజ్జిగ త్రాగకుండా అయిదుగురి ముత్తైదువులకు పెరుగుతో భోజనము పెట్టవలెను. మూడవ రోజు పప్పు తినకుండా అయిదుగురి ముత్తయిదువులకు బూరెలతో భోజనము పెట్టవలెను, నాలుగవ రోజు తల అంటుకోకుండా అయిదుగురి ముత్తయిదువులకు తలంటి, భోజనం పెట్టాలి. అయిదవ రోజు తాంబూలం వేసుకోకుండా అయిదుగురికి భోజనము పెట్టి తాంబూలము ఇచ్చి ఐదు రవికలగుడ్డలు, ఉగ్గుగిన్నె, ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణమూర్తికి అయిదుమూళ్ళ అంగవస్త్రం ఇచ్చి ఉద్యాపనము చేసుకోవలెను.


మరింత సమాచారం తెలుసుకోండి: