అమెరికా ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో 21 ఏళ్ల సిడ్నీ మిచెల్లీ మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అథ్లెటిక్స్‌ ట్రాక్‌ ట్రయల్స్‌లో మెక్‌లాలిన్‌ 51.90 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఇదే రేసులో తన చిరకాల ప్రత్యర్థి దలియా మహ్మద్‌ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెట్‌ చేసిన 52.16 సెకన్ల రికార్డును మెక్‌లాలిన్‌ 0.26 సెకన్ల తేడాతో బద్దలుగొట్టింది. దలియా ఈ హర్డిల్స్‌ను 52.42 సెకన్లలో పూర్తి చేసి ద్వితీయ స్థానానికే పరిమితమవగా ఆమెను వెనక్కి నెట్టిన మెక్‌లాలిన్‌ వరల్డ్‌ రికార్డు టైమింగ్‌తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఇక, తన తాజా ప్రదర్శనపై మెక్‌లాలిన్‌ సంతోషం వ్యక్తం చేసింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనమీద మనకి నమ్మకం ఉండాలని తెలిపింది. సంచలనాత్మక ప్రదర్శనతో రాత్రికి, రాత్రి సెలబ్రెటీగా మారిన మెక్‌లాలిన్‌ కుటుంబ నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెక్‌లాలిన్‌ ఫ్యామిలీ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడింది. ఆమెది క్రీడాకారుల కుటుంబమే కావడం విశేషం. మెక్‌లాలిన్‌ తండ్రి విల్లీ 1984 ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ 400 మీటర్ల స్ర్పింట్‌ సెమీఫైనలిస్ట్‌, ఆమె తలి మేరీ చదువుకునే రోజుల్లో మంచి అథ్లెట్‌. ఇక మెక్‌లాలిన్‌ సోదరుడు టేలర్‌ 2016 అంతర్జాతీయ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల హర్డిల్స్‌లో రజతం పతకం నెగ్గాడు. ఇలా మెక్‌లాలిన్‌ కుటుంబ సభ్యులంతా అథ్లెట్లే కావడంతో ఆమెకు ఈ రంగంపైనే ఆసక్తి ఏర్పడింది. 

2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ అమెరికా స్ప్రింట‌ర్ 16వ స్థానంతో స‌రిపెట్టుకోగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ద‌లియా ఆ రేసును అంద‌రికంటే వేగంగా పూర్తి చేసి స్వ‌ర్ణం సాధించింది. తాజాగా జ‌రిగిన ఒలింపిక్స్ ట్ర‌య‌ల్స్‌లో ద‌లియాను మెక్‌లాలిన్ వెన‌క్కి నెట్ట‌డంతో టోక్యో ఒలింపిక్స్ 400 మీట‌ర్ల రేసు కూడా వీరిద్ద‌రి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట దోహాలో జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మెక్‌లాలిన్‌ రజతం పతకం కైవసం చేసుకొంది. అంతకుముందు 2015లో వరల్డ్ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తను పసిడి పతకం నెగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: