చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రస్తుతం దుమారం రేగుతోంది. నెటిజన్లు కొందరు రైనా వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తుండగా, మరి కొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున 11 సీజన్లుగా ఆడుతున్న సురేష్ రైనా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కామెంటరీ సందర్భంగా తాను బ్రాహ్మణుడినేనని రైనా చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు ఇవే.. మ్యాచ్ సందర్భంగా కామెంటరీలో రైనా చెన్నైతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నాడు. తానూ బ్రాహ్మణుడినేనని, చెన్నైలో 2004 నుంచి క్రికెట్ ఆడుతున్నానని, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలంటే తనకు ఎంతో అభిమానమని చెప్పాడు. తన జట్టులోని టీమ్‌మెట్స్ అనిరుథ శ్రీకాంత్, బద్రీనాథ్ బాల భాయ్ వంటి ప్లేయర్స్‌తో తాను క్రికెట్ ఆడిన విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు రైనా. చెన్నై సూపర్ కింగ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ప్రశంసలు కురిపించాడు. జట్టులో మంచి ఫ్రీడం ఉంటుదని తెలిపాడు.

కాగా, సురేశ్ రైనా వ్యాఖ్యల పట్ల కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై అంటే బ్రాహ్మణుల ఆధిపత్యమేనా? వారు మాత్రమే చెన్నైలో ఉంటారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు సిసలైన చెన్నైను సురేశ్ రైనా ఇంకా చూడలేదని విమర్శలు చేస్తున్నారు. చెన్నైతో తనకున్న అనుబంధం చెప్పడానికి కుల ప్రస్తావన అవసరమా అని కొందరు సోషల్ మీడియా వేదికగా సురేశ్ రైనా‌ను నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు సురేశ్ రైనా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
#ఐ యామ్ బ్రాహ్మణ్ ఆల్సో అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా రైనా చేసిన ఓ చిన్న కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే తెరలేపిందని సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: