GT (గుజరాత్‌ టైటాన్స్‌) వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ తాను ఔట్‌ కానే కాదంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ తంతు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి అనవసరంగా అవుట్ అయిన వేడ్‌ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాక హెల్మెట్‌, బ్యాట్‌పై ప్రతాపం చూపించాడు. హెల్మెట్ విసిరేసి, బ్యాట్‌ను పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక పోయిన వేడ్‌ను IPL మేనేజ్‌మెంట్‌ హెచ్చరికతో సరిపెట్టింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేసి వేడ్‌ IPL కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌-1 నిబంధన ఉల్లఘించాడు.  
 
అయితే, వేడ్ తన కోపాన్ని మనుషులపై కాకుండా ఇలా వస్తువులపై చూపించిన క్రమంలో వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరికతో వదిలేస్తున్నామని, ఎటువంటి జరిమానా విధించడం లేదని IPL మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఇకపోతే ఈ సీజన్‌లో మాథ్యూ వేడ్‌ పెద్దగా రాణించింది లేదు. అసలే సరిగా ఆడడం లేదన్న బాధ ఒకవైపు, థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం మరోవైపు... వేడ్‌కు మరింత కోపాన్ని తెప్పించాయి. అందుకే సహనం కోల్పోయిన వేడ్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కోపాన్ని పీక్స్ లో ప్రదర్శించాడు. విషయంలోకి వెళితే, ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన వేడ్‌ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.  
 
కాగా ఈ మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. తొలుత టైటాన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్‌ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్‌ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl