
గత శుక్రవారం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో టోర్నమెంట్‌ను అర్ధాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో, బీసీసీఐ వెంటనే రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, మిగిలిన సీజన్ కోసం సరికొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మే 17, శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ సందడి మళ్లీ మొదలవనుంది. రీస్టార్ట్ తర్వాత తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడుతుంది. ఇక మే 18, ఆదివారం మధ్యాహ్నం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) ఢీకొంటాయి. అదే రోజు సాయంత్రం ఢిల్లీలో, ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) అమీతుమీ తేల్చుకుంటాయి.
మిగిలిన లీగ్ మ్యాచ్‌ల కోసం మొత్తం ఆరు వేదికలను ఖరారు చేశారు. అవి బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై. అయితే, ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఓ ముఖ్యమైన మార్పు ఏంటంటే.. మే 8న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సగంలో ఆగిపోయింది. ఆ మ్యాచ్‌ను ఇప్పుడు మే 24న జైపూర్‌లో నిర్వహించనున్నారు.
నిజానికి, పాక్ సరిహద్దుకు దూరంగా ఉన్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో అన్ని మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ మొదట ఆలోచించింది. కానీ, వాతావరణం, లాజిస్టిక్స్ సమస్యలు, ముఖ్యంగా కోల్‌కతాలో వర్ష సూచన ఉండటంతో.. చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలలో ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు.
ఈ కొత్త షెడ్యూల్ వల్ల ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ కింగ్స్ జట్టే. వాళ్లు సొంత మైదానం ధర్మశాలలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది (ఢిల్లీతో మ్యాచ్‌తో సహా). కానీ ఇప్పుడు ఆ రెండు మ్యాచ్‌లను జైపూర్‌లోనే ఆడాల్సి వస్తోంది.
నిజానికి షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మే 31న ముగియాలి. కానీ, ఈ మార్పుల వల్ల టోర్నీని మరో మూడు రోజులు పొడిగించారు. అంటే జూన్ 3న ఫైనల్ ఉంటుంది. అలాగే, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఆటగాళ్లపై భారం తగ్గించడానికి డబుల్ హెడర్ మ్యాచ్‌లను కూడా తగ్గించారు. మొత్తం షెడ్యూల్‌లో కేవలం రెండు ఆదివారాలు (మే 18, మే 25) మాత్రమే డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.