ఇంటర్నెట్ డెస్క్: ఓ విమానంలో అనుకోని ఘటన జరిగింది. ఊహించని విధంగా పైలట్‌పై దాడి జరిగింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా షాకయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. ఇంతకీ పైలట్‌పై దాడి చేసింది ఎవరో తెలుసా..? ఓ పిల్లి. మీరు విన్నిది నిజమే.. ఎవరికీ తెలియకుండా విమానంలోకి ప్రవేశించిన పిల్లి చివరకు పైలట్‌పై దాడి చేసి ప్రయాణికులను గందరగోళానికి గురి చేసింది. ఈ ఘటన సూడాన్ నుంచి కతార్ వెళుతుండగా విమానం గాల్లో ఉండగా జరిగింది.

సుడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ నుంచి టార్కో ఏవియేషన్‌కు చెందిన ఓ విమానం బుధవారం కటార్ బయలుదేరింది. ఎప్పటిలానే అంతా బాగుంది. అయితే..టేకాఫ్ అయిన అరగంట తరువాత విమాన సిబ్బంది కాక్‌పిట్‌లో ఏదో కదలిక గుర్తించారు. ఏంటా అని చూస్తే.. అది ఓ పిల్లి. దాన్ని వారు బంధించే ప్రయత్నం చేయాగా.. అది  పైలట్‌పై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా అంతా కలకలం రేగింది. ఇక ఆ పిల్లిని బంధించడం సాధ్యం కాదని భావించిన పైలట్.. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి అత్యవసరంగా ఖార్టూన్ ఎయిర్‌పోర్ట్‌లోనే దించేశాడు. అంతకు ముందు రోజు రాత్రి విమాన్నాన్ని శుభ్రపరిచేందుకు అధికారులు విమానాన్ని అక్కడ పార్క్ చేశారని, అప్పుడే అందులోకి అనుకోకుండా ఈ పిల్లి ప్రవేశించి ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే పిల్లికి విమానం కొత్త ప్రదేశం కావడంతో అది భయాందోళనకు గురై పైలట్‌పై దాడి చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. గతేడాది గోయిర్ విమానంలోకి రెండు పావురాళ్లు ప్రవేశించి కలకలం రేపాయి. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లేందుకు విమానం బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. దీని వల్ల గోఎయిర్ విమానం అరగంట ఆలస్యంగా తన ప్రయాణమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: