పుస్తెలు తాకట్టు పెటైనా "పులసల పులుసు" తినాల్సిందే..అంటారు చాపలు బాగా ఇష్టపడేవారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ది చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి జనం రాజధాని లో ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెల్లేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకుని వెళ్ళేవారట.
అంత రుచికరమైనది పులస చేప అంటే పడిచచ్చేవారు చాలామంది ఉన్నారు. పెద్ద చిన్నా, పెదా, ధనిక అనే తేడాలు లేకుండా పులస చాపలు ఇష్టపడతారు. సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా పులస చాపల సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా కొని తింటారు. ఈ చేప ఆగస్ట్, సెప్టెంబర్ ల లోనే దొరుకుతుంది. దీని ఖరీదు కిలో చేపకి మూడు వేల నుండి నాలుగు వేల వరకు వుంటుంది. దీనికెందుకింత రేటు అనే ప్రశ్నకి సమాధానం 'ఒకసారి తింటే మీరే చెప్తారు' అని అంటారు. అంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ఎలా చేయాలో చూద్దాం!

కావలసిన పదార్థాలు :పులస చేపలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు.
తయారు చేయు విధానం : ముందుగా పులస చేపని శుభ్రం చేసి కావలసిన సైజులో కట్‌చేసి పెట్టుకోవాలి.మెంతులు, ధనియాలు, జిలకర్ర, ఆవాలను మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచాలి.పాన్ వేడయ్యాక నూనె వేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను వేసి వేయించాలి. తరువాత అందులో మసాలా ముద్దను వేసి వేయించాలి. 5 నిమిషాల తరువాత చేప ముక్కలు, ఆవనూనె, ఉప్పు, కారం వేసి వేయించాలి.
నూనె బయటకు వచ్చే వరకు వుంచుకొని అందులో చేప ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. కొద్ది సేపు మగ్గనిచ్చి చింత పండు పులుసు వేయాలి. మూత పెట్టి సన్నని మంటపై ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్క ఉడికాక దించే ముందు వెన్న, కరివేపాకులను , కోతిమీర వేసి దించేయాలి. అంతే రుచికరమైన చేపల పులుసు రెడీ.