టేబుల్ టెన్నిస్ లో చాలా చాకచక్యంగా ఆడాలి. వచ్చే బంతిని మెరుపువేగంతో అందుకోవాలి. అలాంటి క్రీడలో 29ఏళ్ల యువతి ఒంటి చేత్తో ఆడుతోంది. రెండు చేతులున్న వారిని చిత్తుచిత్తుగా ఓడించేస్తోంది. తన విశేష ప్రతిభతో ఇప్పటి వరకు ఎన్నో టైటిళ్లను సొంతే చేసుకొని ఔరా అనిపిస్తోంది. 


ఆస్ట్రేలియాకు చెందిన 29ఏళ్ల మెలిస్సా టాపర్ అనే యువతి.. టేబుల్ టెన్నిస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఒంటిచేత్తోనే ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మెలిస్సాకు చూడ్డానికి రెండు చేతులున్నా.. అందులో ఎడమ చెయ్యి మాత్రమే పనిచేస్తుంది. కుడి చేయి పనిచేయదు. ఆమె తల్లిగర్భం నుంచి బయటకు వచ్చే సమయంలో సగం మాత్రమే బయటికి వచ్చి ఆగిపోయింది. వెంటనే డాక్టర్లు కుడి చేయిని పట్టుకొని లాగడంతో.. కుడి భుజానికి వెళ్లే నరాలు తెగిపోయాయి. నాలుగు నెలల పాటు మెలిస్సా చేయి పనిచేయలేదు. ఆ తర్వాత డాక్టర్లు తొడ భాగంలోని నరాలను తీసి కుడి భుజంలోని నరాలను కలుపడంతో కుడిచేయి కొద్దిగా ఆడించగలిగింది. భుజం సాయంతో చేయినైతే కదిలించగలదు కానీ మణికట్టు మాత్రం తిప్పలేదు. అంతేకాదు ఆ చేయి పెరుగుదల ఆగిపోయింది. 


మెలిస్సా తనకున్న వైకల్యాన్ని బట్టి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. క్రీడలపై తనకున్న ఆసక్తితో ఎనిమిదేళ్ల వయసులో టీటీ ప్యాడిల్ ను చేతపట్టి.. ఆ ఆటలో నైపుణ్యం సాధించింది. ఆస్ట్రేలియాలోనే టేబుల్ టెన్నిస్ లో ప్రతిభ చాటే వ్యక్తుల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అండర్ 18 ఒసియానియా ఛాంపియన్ అయిన మెలిస్సాకు ఆస్ట్రేలియా సీనియర్ టీం కూడా ఆహ్వానించింది. అయితే ఆమెకున్న వైకల్యం కారణంగా పారా క్రీడల్లో మాత్రమే ఆడాలనే ఒత్తిళ్లను ఎదుర్కొంది. కానీ ఆమె ఏమాత్రం నిరుత్సాహానికి గురికాలేదు. ఓ వైపు పారా క్రీడల్లో ఆడుతూ.. ఎలాంటి వైకల్యం లేని సాధారణ వ్యక్తులతోనూ తలపడేది. వివిధ టోర్నీల్లో అలవోకగా విజయం సాధించి టైటిళ్లు సొంతం చేసుకొని అందరితో శభాష్ అనిపించుకుంది. 2012లో జరిగిన లండన్ పారాలింపిక్స్ లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. అదే సంవత్సరం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా నుంచి ఆ కీర్తి సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. తన విశేష ప్రతిభతో 2016 రియో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికైన యువతిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతేకాదు మెలిస్సా గతేడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సంపాదించింది. మరోవైపు ప్రపంచ పారా ఛాంపియన్ షిప్ లో మరో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 


మెలిస్సా కున్న వైకల్యం కారణంగా ఆమెకు అనుగుణంగా ఉండేలా టేబుల్ టెన్నిస్ లో ఆంక్షలు కూడా మారిపోయాయి. సాధారణంగా ఈ క్రీడలో సర్వీస్ చేసే సమయంలో ఎడమ చేతి అరచేతిలో బంతిని ఉంచి.. తర్వాత దాన్ని పైకి ఎగురేసి కుడి చేతితో కొట్టాలి. అయితే ఎడమ చేతితో ఆడే మెలిస్సాకు అలా ఆడటం కుదరదు. కుడి చేయి పనిచేయదు కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి కుడి చేతి బొటన వేలు, ప్రధాన వేలు మధ్యలో బాల్ ఉంచి.. అలానే దాన్ని పైకి ఎగరేసి ఎడమ చేతితో ఆమె కొడుతుంది. అలా టేబుల్ టెన్నిస్ ఆటలో మెలిస్సా కోసం నిబంధనలు మార్చారు. ఆమె సర్వీస్ విషయంలో చాలామంది అంపైర్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. మెలిస్సా తనకున్న వైకల్యాన్ని బట్టి ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. టీటీ రాకెట్ ఎడమ చేతపట్టి అద్భుతాలు సృష్టిస్తోంది. టోక్కో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేదిశగా అడుగులు వేస్తోంది. ఓ వైపు ఆటలో మెరుపులు అద్భుతాలు సృష్టిస్తున్న మెలిస్సా.. తన స్ఫూర్తివంతమైన మాటలతో వివిధ కార్యక్రమాలతో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఆదర్శంగా నిలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: