టెక్నాలజీ వాడకం పెరిగిన తరువాత ప్రతీది ఆన్‌లైన్‌మయం అయిపోయింది. దీంతో సైబర్‌ నేరగాళ్ల‌కు ఇదే మంచి ఫ్లాట్‌పాంగా మారుతుంది. రకరకాల మాట‌ల‌తో మభ్యపెట్టి జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు అక్రమార్కులు. అట్రాక్ట్ అవుతున్న జనం సులభంగా మోసగాళ్ల ట్రాప్ లో పడిపోతున్నారు. ఇక తాజాగా ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో మరో దారుణ మోసానికి గురైంది క‌ల్న‌ల్ భార్య‌. వివ‌రాల్లోకి వెళ్తే.. జమ్ముకాశ్మీర్‌లో పనిచేస్తున్న ఓ కల్నల్‌ కుటుంబం సికింద్రాబాద్‌లో ఉంటోంది. ఓ నైజీరియన్‌ ‘కిమ్‌’ పేరుతో నెలరోజుల క్రితం కల్నల్‌ భార్యను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.

 

ఆపై అసలు కథ ప్రారంభించిన అతగాడు మిమ్మల్ని కలవడానికి భారత్‌కు వస్తున్నట్లు చెప్పడంతో ఆమె అంగీకరించారు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ నుంచి అంటూ కిమ్‌ ఫోన్‌  చేశాడు. అమెరికా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన తనను కొందరు కిడ్నాప్‌ చేశారని, డబ్బు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్‌ చేసిన కిమ్‌.. కిడ్నాపర్లు మాట్లాడతారని అంటున్నారంటూ ఫోన్‌ మరొకరికి అందించాడు. కల్నల్‌ భార్యతో మాట్లాడిన అతగాడు కిమ్‌ను కిడ్నాప్‌ చేసి ఢిల్లీ శివార్లలో దాచామని, తక్షణం రూ.1.5 లక్షలు చెల్లించకపోతే అతడిని చంపేస్తామంటూ బెదిరించారు. 

 

దీంతో ఆమె మూడు విడతలుగా రూ.1.54లక్షలు వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లో వేసింది. జనవరి 31న కల్నల్‌ భార్యకు మరోసారి ఫోన్‌ చేసిన దుండగుడు మీ ఫ్రెండ్‌ని వదిలి పెట్టాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో దుండ‌గులు మ‌రో క‌థ అల్లారు. కిమ్‌ దగ్గర ఉన్న ఫోన్‌లో మీవి, మీ పిల్లలవి వివరాలు, ఫొటోలు ఉన్నాయని.. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని కాశ్మీర్‌లో ఉన్న తన భర్తకు చెప్పింది. 

 

ఇక అది నైజీరియన్ల పనిగా గుర్తించిన ఆయన.. ఇదంతా వాళ్లు ఆడిన డ్రామా అని అర్థమైంది. ఈ క్ర‌మంలోనే ఒక్క పైసా కూడా చెల్లించవద్దంటూ ఆమెకు చెప్పి హుటాహుటిన బయలుదేరి నగరానికి వచ్చారు. కాశ్మీర్‌లో తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం నుంచి శ్రీనగర్‌కు హెలీకాఫ్టర్‌లో అక్కడ నుంచి ఢిల్లీకి, అట్నుంటి సిటీకి విమానంలో వచ్చారు. గురువారం తన భార్యతో సహా వచ్చి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: