ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరులో శ‌నివారం ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దున్న‌పోతుల‌తో బండిని న‌డిపి త‌మ నిర‌స‌న తెలియ‌జేశారు. త‌హ‌శీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. దీంతో ఒక్క‌సారిగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. త‌మ‌ను రెచ్చ‌గొట్టేలా కావాల‌నే వైసీపీ కార్య‌క‌ర్త‌లు మాట్లాడారంటూ టీడీపీ వారు ఆరోపించ‌గా, కాదు వారేనంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇరువ‌ర్గాల‌కు స‌ర్దిచెప్పే క్ర‌మంలో చింత‌మ‌నేనికి, పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పోలీసుల దౌర్జ‌న్యంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మ‌ళ్లీ ధర్నాకు దిగే ప్ర‌య‌త్నం చేయ‌గా అంద‌రూ వారించ‌డంతో కార్య‌క్ర‌మాన్ని విరమించుకున్నారు.  దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌డం అల‌వాటుగా మారిపోయింద‌ని పోలీసులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: