బేసిన్‌ వెలుపలకు కృష్ణా జలాలు తరలించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రయత్నిస్తోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. అనుమతుల్లేకుండా బ్రహ్మంసాగర్‌ ఎడమకాల్వపై చేపట్టిన ఎత్తిపోతల పనులు ఆపాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. చెరువులు నింపేలా ఎస్పీబీవీఆర్ ఎడమకాల్వపై కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ టెండర్ నోటీసు జారీ చేసిందని తెలంగాణ ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.


కృష్ణా మిగులు జలాలపై ఆధారపడ్డ తెలుగు గంగ ప్రాజెక్టు కాంపోనెంట్లు, విస్తరణ ఆధారంగా బేసిన్ వెలుపల కొత్త ప్రాజెక్టులు చేపట్టడం విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ ఈఎన్‌సీ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలంగాణ ఈఎన్‌సీ అన్నారు. బేసిన్‌లోని నాగార్జునసాగర్ ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ ఈఎన్‌సీ అన్నారు. ఈ పరిస్థితుల్లో కేఆర్‌ఎంబీ , అపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేకుండా.. కృష్ణా జలాలపై ఆధారపడి. తెలుగుగంగ ప్రాజెక్టు కాంపోనెంట్లు, విస్తరణ పనులు చేపట్టకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: