తీవ్ర ఆర్థికమందగమనంలో ఉన్న వివిధ రంగాలకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉద్దీపన ప్రకటనలు చేసింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తేజం తెచ్చేందుకు ప్యాకేజీని ప్రకటించాయి. టెలికం కంపెనీలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావం కంటే ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఎక్కువగా పడింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాపై ఈ భారం మరింత ఎక్కువ పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని, తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. 


చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెలికం రంగం పునరుజ్జీవ చర్యల్లో భాగంగా సెక్రటరీ కమిటీ మొబైల్ కాల్స్, డేటా కనీస ధరను నిర్ణయించనుందని తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కమిటీ డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం నుంచి సిఫార్సులు కోరినట్లుగా తెలుస్తోంది. టెలికం కంపెనీల కోసం అన్ని టారిఫ్‌లకు కనీస ఛార్జీలు నిర్ణయించడం, టెలికం ఆపరేటర్లపై దాని ప్రభావాన్ని అంచనా వేయడంపై కమిటీ సిఫార్సులు కోరిందట


ఇదే జరిగితే సుప్రీం కోర్టు తీర్పు వల్ల అతి భారంగా మారిన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ వంటి వాటికి ప్రయోజనం చేకూరుతుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీల నష్టం రూ.74,000 కోట్ల వరకు కావడం గమనార్హం.వివిధ టెలికం కంపెనీలు లక్ష కోట్ల వరకు ప్రభుత్వానికి  ఏజిర్ కింద చెల్లించవలసి ఉంది. వీటిపై ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ వంటివి విన్నవించుకుంటున్నాయి.


కనీస ధరను పెట్టాలి అని డిపార్టుమెంట్ ఆఫ్ టెలికంను కమిటీ కోరినట్లుగా తెలుస్తోంది. త్వరలో వాయిస్, డేటా టారిఫ్ ధరల కనీస ధరలపై సంప్రదింపులు జరిపి ఆ తర్వాత ఖరారు చేస్తుందని అంటున్నారు. టెలికం ఆపరేటర్ల ఆర్థిక ప్రయోజనాలు, హేతుబద్దత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని కనీస ఛార్జీని నిర్ణయించవచ్చునని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: