హైదరాబాద్, దాని చుట్టుపక్కల భూములు, స్థలాలు, స్థిరాస్తుల విలువలను ప్రభుత్వం పెంచబోతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రేట్లు అమాంతం పెరగనున్నాయి. తెలంగాణ సర్కారు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింతగా ప్రయత్నించడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ అంతటా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్‌ విలువలను దాదాపు 8 నెలల క్రితమే పెంచారు. సాధారణంగా ఈ విలువల పెంపు గతంలో 2,3 ఏళ్లకు ఓసారి ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఏడాది తిరక్కముందే భూముల విలువలు పెంచుతోంది.


దాదాపు 8 నెలల క్రితం రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి, భువనగిరి, షాద్‌నగర్‌ పరిధిలోని భూముల విలువలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి రేట్లు భారీగా పెరగబోతున్నాయి. అంటే ఏడాదిలోపే రెండోసారి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువలు పెరగబోతున్నాయన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చదరపు అడుగు అంటే ఎస్‌ఎఫ్‌టీ రూ.3,500 లోపు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు అందుబాటులో లేవు. అయితే.. హైదర్‌గూడ, అత్తాపూర్‌ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ రేటు ఎస్‌ఎఫ్‌టీకి రూ.2,400గా ఉంది.


ఇంకా మీర్‌పేట, జిల్లెలగూడ, తుర్కయంజాల్‌, చింతలకుంటలో ఎస్‌ఎఫ్‌టీ 2 వేలకు లోపుగా ఉంది. సరూర్‌నగర్‌, మియాపూర్‌, మదీనాగూడ, గచ్చిబౌలి, హఫీజ్‌పేట, మాదాపూర్‌, ఖాజాగూడ, శేరిలింగంపల్లిలో మార్కెట్‌ విలువ ఎస్‌ఎఫ్‌టీకి రూ.3,600గా ఉంది. అందుకే వాస్తవ రేట్లకు.. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ రేటుకూ అంతరం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.


స్థలాల విషయం కూడా అంతే..  వాస్తవానికి హైదర్‌గూడ, అత్తాపూర్‌, జిల్లెలగూడ, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో చదరపు గజం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.30 వేలలోపు ఉంది. అయితే.. ఇంకా ఇప్పటికీ మణికొండ జాగీర్‌, కోకాపేట, నార్సింగ్‌, మీర్‌పేట ప్రాంతాల్లో మార్కెట్‌ విలువ రూ.20 వేలలోపే ఉంది. కోకాపేట, నార్సింగ్‌లోనూ ఎకరా భూమి రూ.30 కోట్ల వరకూ ఉన్నా.. రిజిస్ట్రేషన్‌ విలువ మాత్రం చదరపు గజానికి ఇంకా రూ.17 వేలే ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: