ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో జరిగిన సంఘటనలు రాష్ట్రంలో చర్చలకు తెర తీసాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో జరిగిన కులాంతర వివాహం ఏకంగా ఇద్దరు వ్యక్తుల (తండ్రీ కొడుకులు) కిడ్నాప్‌‌కు కారణమైంది. ఒంగోలుకు చెందిన తలకాయల వినోద్‌ గత ఏడాది ఆగస్టు 14న కడప జిల్లా రాజంపేటకు చెందిన వనజ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి సామాజిక వర్గాలు వేరు కావడంతో వనజ కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. దీనిపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇరు వర్గాలపై ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల రెండో తేదీన వినోద్‌ తండ్రి గోపాల్‌, సోదరుడు మధు ద్విచక్ర బైక్‌పై బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే రాజంపేట నుంచి వచ్చిన వనజ తండ్రి అన్నారెడ్డి లక్ష్మణ స్వామిరెడ్డి, అతడి కుమారుడు దినేష్‌ రెడ్డితో పాటు మరికొందరు సీఆర్‌పీ క్వార్టర్స్‌ వద్ద గోపాల్‌, మధులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులో వారిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. వినోద్‌, వనజ నెల్లూరులో ఉంటున్నారని చెప్పటంతో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ కడప జిల్లా బద్వేలు వరకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. బద్వేలులో వారిద్దరిని దించేసి మాపై కేసు పెడితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. బాధితులు అక్కడి నుంచే ఒంగోలు రూరల్ సీఐకి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో సీఐ తన సిబ్బంది సాయంతో వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బాలిక కిడ్నాప్ కేసును కేవలం మూడు గంటల్లోనే చేధించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు. నగరంలోని ఇన్నీసుపేట దుర్గాలమ్మ గుడి వీధికి చెందిన బి.రాము రెండో కూతురు రోహిణి శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన అనసూరి సత్యనారాయణ ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సత్యనారాయణ దేవరపల్లి మండలం తిరుగుడుమెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బాలికను అతడి బారి నుంచి రక్షించారు. ఏలూరుకు చెందిన సీతారత్నం, జ్యోతి అనే మహిళలు చిన్నారిని పెంచుకుంటామని అడగడంతో సత్యనారాయణ బాలికను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం మూడు గంటల్లో కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: