ఆంధ్రా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా.. కనీసం సమీపంలో లేకున్నా కేంద్రంలోని మోదీ సర్కారు ఎలాంటి వివక్ష లేకుండా మన తెలుగు రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూనే ఉంది.  ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఆ రెండు ప్రాంతాల ఆశలకు మోక్షం లభించనుంది. తెలంగాణ, ఏపీ మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై అత్యాధునిక సస్పెన్షన్ తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.


తెలంగాణలోని కొల్లాపుర్ నుంచి ఏపీలోనికి రాకపోకలు సాగించాలంటే సుమారు 100 కి.మీ. చుట్టు తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే మున్ముందు ఇలాంటి కష్టాలకు తెరపడనుంది. 2007లో కృష్ణానదిలో పడవ మునగడంతో 61మంది జల సమాధి అయ్యారు. అప్పటి నుంచి నదిపై వంతెన నిర్మించాలని ఇక్కడి ప్రజలు గట్టిగా కోరుతున్నారు. అధికారులు ప్రతిపాదనలు పంపినా కాగితాలు దాటలేదు. ఈ క్రమంలో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారత్ మాల-2 పరియోజన పథకం పరిధిలో వారధి నిర్మాణాన్ని ప్రతిపాదించింది.


తెలంగాణలోని కొల్లాపూర్ సమీప సోమశిల నుంచి ఏపీలోని శ్రీశైలం నియోజకవర్గం కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వరకు సుమారు 3 కి.మీ. వంతెన నిర్మించేందకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే  దీనికి ఆమోదం తెలుపుతూ నిర్ణయించింది. దీనికి సుమారు రూ.1100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. పర్యాటకాభివృద్ధికి అనువుగా నదిపై నాలుగు వరుసల్లో సస్పెన్షన్ వైర్ బ్రిడ్జిని నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


మరో వైపు రెండు రాష్ట్రాల మధ్య 170 కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు సుమారు రూ.1500 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ పరిధిలోని కల్వకుర్తి నుంచి సోమ శిల వరకు 79.3 కి.మీ. మేర రెండు వరుసల రహదారి పనుల విస్తరణకు రూ.886.70 కోట్లు కేటాయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: