తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్ ని లోక్ సభ ఎన్నికల్లోను చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలో ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఆయన నేతృత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లనుంది. అయితే అధిష్ఠానం ఆయనకు టార్గెట్ 15 ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


మొత్తం 15 ఎంపీ సీట్లు గెలవాలని  ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జి కే.సీ. వేణుగోపాల్ టీ కాంగ్రెస్ కు సూచించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బలహీన పడిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ వంద రోజుల పాలనలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పనులు తదితర వాటిని బేరీజు వేసుకొని గెలిపించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.


వందరోజుల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం తదితర పథకాలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తాయని  ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని అర్థం అవుతుంది.


అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ  చేయలేదు. మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందలేదు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడం లేదు. వ్యవసాయానికి నీటి సమస్య, కరెంట్ కష్టాలు, పెన్షన్ల పెంపు జరగలేదు. దీంతో పాటు పెంచుతామన్న రైతుబంధు వేయలేదు. ఇవి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వీటిని తట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: