తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కోమటిరెడ్డి బ్రదర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి కి పెద్దగా సఖ్యత లేదు.  ఆ మాటకొస్తే కాంగ్రెస్ లో చాలామందికి రేవంత్ రెడ్డి విరోధిగానే కనిపించేవారు. ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి బహిరంగంగానే పలు సందర్భాల్లో విమర్శించారు. ఇక రాజగోపాల్ రెడ్డి సంగతి అయితే చెప్పే పనే లేదు.


డబ్బులు ఇచ్చి మరీ పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించి.. నాయకత్వంలో పనిచేయనని చెప్పి కాషాయ కండువా కప్పుకొన్నారు. ఏమైందో తెలియదు. తిరిగి మళ్లీ సొంత గూటికే చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం.. సీఎంగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించిన తర్వాత సమీకరణాలన్నీ చకచకా మారిపోయాయి. రేవంత్ పై పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అలాగనీ మరీ రాసుకు పూసుకు తిరగడం లేదు. కానీ ఇప్పుడు కోమటి రెడ్డి బ్రదర్స్ పూర్తిగా మారిపోయారు.


సలార్ సినిమా లో పాటను ఎడిట్ చేసి మరీ రేవంత్ కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా భువనగిరిలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడి  మరీ సీఎం రేవంత్ ను ఆకాశానికెత్తారు. ఇప్పుడే ఆట మొదలైందని.. రేవంత్ రెడ్డికి ఇరువైపులా మా బ్రదర్స్ ఉంటామని.. కాంగ్రెస్ ని ఎవరు టచ్  చేస్తారో చూస్తామని హెచ్చరించారు.


మరోవైపు సీఎం రేవంత్ కూడా నా తర్వాత ఆ పదవి చేపట్టే అర్హత కోమటిరెడ్డి వెంకట రెడ్డికే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ పొగడ్తల వర్షం కురిపించడం చూసి కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.  సీఎంతో అవసరాల దృష్ట్యా రేవంత్ తో వైరం పెంచుకోవడం ఇష్టంలేక ఇలా మారిపోయారని కొందరు అంటున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారు అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: