ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా తయారైంది హైదరాబాద్ మెట్రో వ్యవహారం. తాజా పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రో ప్రాజెక్టు లో భాగస్వామ్యం ఉన్న  ఎల్ అండ్ టీ యాజమాన్యానికి మధ్య వివాదం రాజుకున్నట్లే కనిపిస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన మహాలక్ష్మి పథకమే.


నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకం విజయవంతం అయింది. మహిళల్లో కూడా కాంగ్రెస్  కు ఆదరణ తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకంపై విమర్శలు గుప్పించింది ఎల్ అండ్ టీ యాజమాన్యం.


ఈ పథకం వల్ల మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుందని ఎల్ అండ్ టీ గ్రూపు అధ్యక్షుడు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ పేర్కొన్నారు. బస్సులో మహిళల ఉచిత ప్రయాణం మెట్రో ట్రాఫిక్ ను పూర్తిగా దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.  కనీసం ఐదు శాతం వరకు సంస్థ ఆదాయంపై ప్రభావం చూపుతుందని చెప్పారు.  పరిస్థితి ఇలానే కొనసాగితే మెట్రో రైలు ప్రాజెక్టులో తమ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంటామని తేల్చి చెప్పారు.


దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ధీటుగానే బదులిచ్చారు. ఎవరెన్ని చెప్పినా ఈ పథకం ఆగదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎల్ అండ్ టీ తప్పుకుంటే ప్రాజెక్టు నిర్వహణ కోసం వేరే భాగస్వామని ఏర్పాటు చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కాంట్రాక్టర్ పోతే మరొకరు వస్తారు అని కుండబద్దలు కొట్టారు. రేవంత్ ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణాలు పరిశీలిస్తే ఇప్పటికే ఈ పథకం వల్ల ఆటో కార్మికులు దెబ్బతిన్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకొనే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా ఈ పథకం నెగిటివ్ మూడ్ లో ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంది. పైగా దీనిని రాజకీయంగా ముడి పెట్టడంతో సీఎం రేవంత్ ఎల్ అండ్ టీ పై గుస్సా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: