ఏపీ సీఎం  జగన్ కొత్త జట్టును ఎన్నుకున్నారు. ఆ కొత్త జట్టు ఇవాళ్టి నుంచి పని ప్రారంభిస్తోంది. అయితే.. ఈ కొత్త జట్టు కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేబినెట్ కూర్పు అంటేనే కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇలా అన్నింటిని సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. వీటిలో ఏ ఒక్క ఈక్వేషన్‌ సరిగ్గా సెట్ కాకపోయినా అసంతృప్తి సెగలు భగ్గు మంటాయి. ఇప్పుడు అదే జరిగింది. బడుగు, బలహీన వర్గాలకు 68 శాతం వరకూ మంత్రి పదవులు ఇచ్చామని జగన్ టీమ్ చెప్పుకుంటోంది. ఇది విప్లవాత్మకమే.


కానీ ప్రాంతాలవారీ సమతుల్యంలో మాత్రం జగన్ ఫెయిలయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్త జిల్లాలు అన్నింటికీ ప్రాతినిథ్యం దక్కలేదు. ఏకంగా 8 జిల్లాలకు ప్రాతినిథ్యమే లేదు.  సామాజిక సమీకరణాలు, ఒత్తిళ్లు కారణంగా ఈ 8 జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యేకీ కూడా మంత్రి పదవి దక్కనేలేదు. పరిపాలన వికేంద్రీకరణ అంటూ ఇటీవలే కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన జగన్.. వాటిలో ఎనిమిది జిల్లాలకు మంత్రి పదవి అవకాశం ఇవ్వకపోవడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.


జిల్లాల ఏర్పాటుతో ముందుగా జిల్లాకో పదవి చొప్పున వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు లెక్కలు వేసుకున్నారు. కానీ.. ఆ లెక్కలు జగన్ ముందు ఫలించలేదు. దీంతో పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు చివరకు తీవ్ర నిరాశకు లోనయ్యారు. చాలా జిల్లాల్లో రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఏకంగా చిత్తూరు జిల్లాకైతే.. అత్యధికంగా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదికన తీసుకుంటారని ఆశపడిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు.


అసలు  పదవులు దక్కని జిల్లాలు ఏంటంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, విశాఖ జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా.. ఈ జిల్లాలకు అసలు మంత్రి వర్గంలో స్థానమే లేకుండా పోయింది. మరి దీన్ని బట్టి చూస్తే జిల్లా అనే సమీకరణాన్నే జగన్ పట్టించుకున్నట్టు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: