దేశాభివృద్ధిలో రహదారులది కీలక పాత్ర. ఏ ఊరికైనా మంచి రోడ్డు ఉంటేనే.. అన్ని సౌకర్యాలు సమకూరతాయి. అందుకే ఇలాంటి మౌలిక సదుపాయాలను చక్కగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ.. పాలకుల్లో ఇలాంటి స్పృహ కొరవడుతోంది. మా ఊరికి సరైన రోడ్డు లేదు మహా ప్రభో అని జనం అవే రోడ్లపై పొర్లు దండాలు పెట్టే దుస్థితి దాపురిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి ఘటనలు ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వరుసగా చోటు చేసుకుని వైరల్ అయ్యాయి.


మ గ్రామానికి రోడ్డు వేయాలని మొన్న కడప జిల్లా  సోమిరెడ్డిపల్లె పంచాయితీ సభ్యుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. బురద రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ జగనన్నా.. రోడ్లు వేయాలంటూ నినాదాలు చేసిన వీడియో వైరల్ అయ్యింది. వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీకి చెందిన వార్డు సభ్యుడు రాజేష్‌ తమ గ్రామం రోడ్డుపై  పొర్లు దండాలు పెట్టాడు. 40ఏళ్ల కిందట గ్రామం ఏర్పడినా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదన్నాడు.


ఇక ఇటీవల తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో ఏకంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడే ఇలా రోడ్డుపై పొర్లు దండాలు పెట్టాడు. సార్ రోడ్లు బాగు చేయించండి అంటూ మొత్తుకున్నాడు. ఎంత చెప్పినా..అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ ఆవేదన చెందాడు. ఏకంగా కంకర తేలిన రోడ్డుపై పొర్లుదండాలు పెట్టేశాడు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.  


తాజాగా కర్ణాటకలోనూ అదే సీన్ రిపీటైంది. రోడ్ల పరిస్థితిపై ఉడుపికి చెందిన నిత్యానంద అనే సామాజిక కార్యకర్త రోడ్లపై పొర్లు దండాలు పెట్టాడు. ఇంద్రాలి రైల్వే బ్రిడ్జి సమీపంలోని రోడ్డుపై.... అనేక చోట్ల గుంతలు ఏర్పడినా పట్టించుకోవడం లేదని పొర్లు దండాలు పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నాడు. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరయినా.. రోడ్ల దుస్థితిపై అందరి ఆవేదనా అదే.. మరి పాలకులు పొర్లు దండాలు పెట్టినా పట్టించుకుంటారా అన్నదే అసలైన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: