
ఈ ముఠా గుట్టును సైబరాబాద్ మానవ అక్రమ రవాణ నిరోదక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్ఛులో విదేశాలకు చెందిన మహిళలతో పాటు వివిధ నగరాలకు చెందిన యువతులు కూడా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠా కేవలం వ్యభిచారంతోనే ఆగిపోలేదు.. మహిళలు, యువతులకు నిర్వాహకులు డ్రగ్స్ అలవాటు చేయడం, అమ్మాయిలతో విటులకు కూడా డ్రగ్స్ అలవాటు చేయడం వంటి షాకింగ్ వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా వెబ్‌సైట్లు, వాట్సప్ ల ద్వారా ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ ముఠాలో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, ముంబాయి, కోల్‌కత్తా, అస్సోం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిల్యాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
అంతే కాదండోయ్.. ఈ అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యభిచార ముఠా పలు ప్రాంతాల్లో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేసింది. నిర్వాహకులు దందా మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేవారు. ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫోటో కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యభిచార ముఠాలో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 39 కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి 34 చరవాణులు, 3 కార్లు, లాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.