లింగమనేని రమేష్‌ గ్రూపు.. తమను రూ. 900 కోట్ల మేరకు మోసం చేసిందని చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ బి.ఎస్‌.రావు ఆరోపించారు. విద్యా సంస్థల విస్తరణ కోసం కావాల్సిన భూములు, భవనాలను సేకరించి అందజేసేందుకు లింగమనేని రమేష్‌ గ్రూపు కంపెనీలు తమను సంప్రదించి నగదు చెక్కులు తీసుకుందన్నారు. ఒప్పందాలు చేసుకుని ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేశాయంటూ చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ డా. బి.ఎస్‌.రావు ఆరోపించారు. లింగమనేని రమేష్‌ గ్రూపు కంపెనీలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఐదు కేసులు దాఖలు చేసినట్లు బి.ఎస్‌.రావు తెలిపారు.


మోసపూరిత విధానాలు అనుసరించిన లింగమనేని గ్రూపు నుంచి 900 కోట్ల రూపాయల వరకు తమకు రావాల్సి ఉందని బీఎస్‌ రావు వెల్లడించారు. 1986లో మహిళా కళాశాలతో ప్రారంభించిన తమ ప్రస్తానం ఇప్పుడు పాఠశాలు, కళాశాల్లో సుమారు ఏడు లక్షల మంది విద్యార్ధులకు ఉత్తమ బోధన అందిస్తున్నామని..  పాఠశాలస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అందుబాటులో ఉంచేందుకు.. డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం.. పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సదుపాయాల విస్తరణ కోసం తాము ప్రయత్నిస్తున్న దశలో 2012-13 సంవత్సరంలో లింగమనేని రమేష్‌ గ్రూపు తమను సంప్రదించిందని  బి.ఎస్‌.రావు అన్నారు.


విద్యా సంస్థల కోసం కావాల్సిన భూములు, భవనాలు సేకరించి వాటిని తమ చైతన్య సంస్థలకు ఇచ్చేలా హామీ ఇచ్చారన్న  బి.ఎస్‌.రావు... ఇందుకోసం పెద్ద మొత్తంలోనే నిధులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 2013లో తమకు కావాల్సిన భూములు, భవనాలు ఇవ్వలేకపోయినందుకు వడ్డీతో సహా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ ఒప్పందం కదుర్చుకున్నారని  బి.ఎస్‌.రావు అన్నారు.


కానీ ఇంతవరకు ఒక్క ఎకరం భూమి ఇవ్వలేదు.. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదని డాక్టరు బి.ఎస్‌.రావు తెలిపారు. తాము అనేకమార్లు అడిగిన మీద 2015లో మళ్లీ మరో ఒప్పందం చేసుకున్నారని.. కొన్ని భూములను రిజిస్ట్ర్‌ చేసి ఇస్తామంటూ హామీ ఇచ్చారని.. కానీ ఆచరణలోకి అవి రాలేదని బి.ఎస్‌.రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: