
ఆసియా పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్ పైన ఏకాభిప్రాయానికి వచ్చి ఈ మూడు దేశాలు ప్రకటించాయి. అమెరికాలోని శాండిగోలో జరిగిన కార్యక్రమం దీనికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి బైడెన్, బ్రిటన్ ప్రధాని రుషి సనక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెనీస్ పాల్గొన్నారు. అకస్ ఒప్పందంలో అంతర్భాగమైనటువంటి అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్ లో భాగంగా ఆస్ట్రేలియాకు అమెరికా 2030దశకంలోని తొలి నాళ్ళలో దశలవారీగా 3అణు ఇంధనాలతో పనిచేసే జలాంతర్గాములను అందించబోతుంది.
వచ్చే ఐదేళ్లలో అమెరికా జల అంతర్గాముల నిర్మాణ సామర్ధ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్ మెరైన్ నిర్వహణ కోసం మొత్తంగా 460కోట్ల డాలర్లను వినియోగిస్తుంది. వర్జీనియా జలాంతర్గాములతో దశాబ్ద కాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర్గాముల సామర్థ్యం ద్విగుణీకృతమైంది. బ్రిటన్ జలంతర్గాముల టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికల అనుసంధానంతో నడిచే సంప్రదాయక ఆయుధాలను అమర్చినటువంటి జలంతర్గామి తయారు కాబోతుందని సునాక్, ఆల్బేనస్ ల సమక్షంలో బైడెన్ ఇలా ప్రకటించారు.
మూడు దేశాల మైత్రితో కొత్త అధ్యాయం మొదలైందని ఆల్బెనీస్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా అంతర్జాతీయ రవాణాకు కీలకంగా ఉన్న ప్రాంతం. దక్షిణ చైనా సముద్రంపై హక్కులు తమకే చెందుతాయని చైనా వాదిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.