కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.... త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంటూ ఎంతో స్ఫూర్తిదాయకంగా... మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడంతో పాటు, సామాన్యులకు టిక్కెట్లు ఇచ్చి ఎన్టీఆర్ గెలిపించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ముందుకు నడిచింది. ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో టిడిపి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు సైతం ఆ పార్టీని క్రమశిక్షణకు మారుపేరుగా ముందుకు నడిపించారు.


ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా  నిలబెట్టేందుకు నిరంతరం చంద్రబాబు కృషి చేశారు. మొదట్లో టిడిపిలో అవినీతికి ఆస్కారం లేకుండా ...క్రమశిక్షణతో పార్టీ నడిపించారు. ఆ తరువాత చంద్రబాబు ఆ పార్టీ నాయకుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పార్టీలో  బంధుప్రీతి, నాయకుల అవినీతి వ్యవహారాలు కారణంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న మంచి పేరుని కాస్తా పోగొట్టుకుంటూ వచ్చింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఉంటూ వచ్చిన టిడిపి అవినీతి వ్యవహారాల్లో పీకల్లోతులో మునిగిపోయి సామాన్యుల్లో ఆ ముద్రను చెరుపుకుంటూ స్వీయ తప్పిదాలు చేస్తూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కి దక్కిన ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి చేదు ఫలితాలు ఆ పార్టీకి ఎప్పుడు దక్కలేదు. దీనంతటికీ కారణం టిడిపి ప్రభుత్వంలో ఇతర నాయకులు పెత్తనం పెరగడమే ప్రధాన కారణం. ప్రజల బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి కంటే సొంత పార్టీ, సొంత కుల నాయకులు అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు ముందుకు వెళుతూ ఎప్పుడూ లేనంతగా విమర్శలు మూటగట్టుకున్నారు. రాజధానిగా  అమరావతిని ప్రకటించిన విషయంలో చంద్రబాబు ఈ విధంగానే వ్యవహరించి చెడ్డ పేరు సంపాదించుకున్నారు. రాజధాని ప్రకటనకు ముందే తమ పార్టీ కీలక నాయకులూ, బినామీలతో అక్రమంగా భూములు కొనుగోలు చేయించి దానికి అనుగుణంగా రాజధాని ఎలైన్మెంట్ మార్పించి విమర్శలపాలయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా పార్టీని మార్చి అసమర్థుదైనా.. తన కుమారుడిని పార్టీ లో కీలకం చేసేందుకు పార్టీలోని ఇతర నాయకుల మీద పెత్తనం చేస్తూ ఆ సొంత పార్టీ నాయకుల నమ్మకం కోల్పోయారు.


 రాష్ట్రంలో వైసిపి, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి పరిస్థితి మరింతగా దిగజారింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను.. అక్రమాల పుట్ట ను తవ్వి తీస్తూ...  నిజా నిజాలు ఏంటో దర్యాప్తు సంస్థల ద్వారా వెలికి తీస్తూ టిడిపి తో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెన్నులోనూ వణుకుపుట్టేలా దర్యాప్తు కొనసాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోని అవినీతి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ తెలుగుదేశం పార్టీ పరువును జనాల్లో మరింతగా పలుచన చేస్తున్నాయి. చంద్రబాబు పీఎస్ గా పనిచేసిన వ్యక్తి దగ్గరే సుమారు 150 కోట్లు వరకు ఆస్తులకు సంబంధించిన ఆధారాలు దొరకడం... అలాగే చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొంది టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన కిలారి  రాజేష్ వద్ద అనేక అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, అక్రమ ఆస్తులు బయటపడడం పెద్ద సంచలనంగానే ఉంది.


 ఇక అమరావతి భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ లోని  కీలక నాయకుల పేర్లు బయటకు రావడం ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులకు అసహనం, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇక ప్రజల్లో అయితే మరీ ఇంత దారుణమా అనే భావనను పెంచుతున్నాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు వాస్తవాన్ని కప్పి పెడుతు నాయకులను వెనకేసుకు వస్తూ ముందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ పరంగా కనుమరుగయ్యే పరిస్థితి అతి తొందరలోనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితి ఏమిటో సమగ్రంగా చర్చించి టీడీపీ ఆవిర్భావంలో ఉన్నట్టుగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. 


అదే సమయంలో రాష్ట్రానికి మంచి చేసే విషయంలో అధికారం లో ఏ పార్టీ ఉన్నా ... దానికి సహకరిస్తూ ... ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని హైలెట్ చేస్తూ, ప్రజా ఉద్యమాలు చేపడితే ఫలితం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటూ ఆందోళన చేస్తే సామాన్య ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీపై ఉన్న గౌరవ మర్యాదలు మరింతగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. వయసు రీత్యా చంద్రబాబు మరెంతోకాలం యాక్టివ్ గా పాలిటిక్స్ నడిపించలేరు.


 కాబట్టి యాక్టివ్ గా ఉన్నన్ని రోజుల్లో అయినా హుందాగా రాజకీయం చేస్తే చరిత్రలో బలమైన, సమర్ధుడైన నాయకుడు గా మిగిలే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అవినీతి వ్యవహారాలలో తమ పార్టీ నాయకులను వెనకేసుకు వస్తూ ప్రజావ్యతిరేక విధానాలను ఇంకా పాటిస్తూ ముందుకు వెళితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితి కంటే మరింత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళతాడో.. ముందు ముందు ఏ విధంగా వ్యవహరిస్తాడో చూడాలి . దాని ఆధారంగానే ఆయన రాజకీయ వారసుడి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: