ఏం జరుగుతోందో.. ఎందుకు జరుగుతోందో.. ఎలా జరుగుతుందో తెలియదు గాని, మొత్తానికి ఏదో జరుగుతుందనే అభిప్రాయం మాత్రం ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుంది. టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, బిజెపి మిగతా చిన్నచితకా పార్టీలు ఎన్నో ఉన్నాయి.ఏ పార్టీలోనూ సానుకూల పరిస్థితులు లేవు. ప్రతి పార్టీ గందరగోళంలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలు చోటుచేసుకోవడం, ఇంకా అనేకమంది ఆ పార్టీ వైపు చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో ఆ పార్టీలో ఉన్న నాయకుల్లోనూ గందరగోళం నెలకొని ఉండగా, 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమి చెంది, ఒక్క సీటు మాత్రమే దక్కించుకున్న జనసేన రాజకీయంగా బలపడేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అసలు 2024 నాటికి అధికార పార్టీకి పోటీ ఇచ్చే స్థాయికి వస్తుందా అనేది ఆ పార్టీ నాయకులకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి.


 ఇక బిజెపి విషయానికి వస్తే, చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అయినా, అంత గొప్పగా ఏమి ఇక్కడి పరిస్థితి లేదు. కేవలం కొద్ది మంది నాయకులు తప్ప, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమే లేదు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడమే తప్ప, సొంతంగా బలం పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించని పరిస్థితి. పోనీ 151 సీట్లతో అసెంబ్లీ 22  పార్లమెంటు స్థానాలు ఉన్న ఆ పార్టీకి ఇప్పుడు మనశ్శాంతి లేనట్టుగా తయారయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి చేస్తున్న రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి వారు పార్టీపై తిరుగుబావుటా ఎగరవేసి పార్టీని, పార్టీ అధ్యక్షుడిని విమర్శిస్తూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. 


పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తే, పార్టీకి తిరిగి షోకాజ్ నోటీసు ఇచ్చినంత హడావుడి చేస్తున్నాడు. అయితే ఆయన పార్టీపై విమర్శలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ధిక్కార స్వరం వినిపించడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమీ లేవని, రాజు గారి వెనుక బిజెపి కేంద్ర పెద్దలు ఉన్నారని,వారే వెనకుండి విమర్శలు చేస్తున్నారని, తమ పార్టీకి చెందిన అసంతృప్తి నాయకులను బిజెపిలోకి ఆకర్షించేందుకు ఇలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు పెరగడానికి ఆ పార్టీ అధినేత జగన్ తప్పిదం కూడా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోయినా, ఇప్పటికీ జగన్ దర్శనం కూడా లభించలేదు. 


నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానీ, ఇతర పార్టీ వ్యవహారాల గురించి గాని చెప్పుకునేందుకు అవకాశం దక్కడం లేదు అనే బాధ వారిలో ఎక్కువ కనిపిస్తోంది. అలాగే మొత్తం పరిపాలన వ్యవహారాలన్నీ, అధికారుల చేతుల్లో పెట్టడంతోనే తమ చేతులకు కనిపించిన బేడీలు జగన్ వేశారనే అసంతృప్తి చాలామంది నాయకుల్లో వచ్చేసింది. ఇప్పుడిప్పుడే అటువంటి వారంతా ఒక్కొక్కరిగా బయటపడుతుండడంతో బీజేపీలో ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నఅసంతృప్తులు అందరినీ తమ వైపు లాక్కోగలిగితే, 2024 ఎన్నికల నాటికి తమకు పెద్దగా ఇబ్బంది ఉండదని, ఎలాగూ పవన్ సహకారం ఉంటుంది కాబట్టి, ఏపీ అధికార పీఠం దక్కించుకోవచ్చనే అభిప్రాయంలో ఉంటూ ముందుకు వెళుతుంది. 


ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి. అసలు కేంద్ర బిజెపి పెద్దలు తమ పార్టీపై ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేది ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ఒక్కో సందర్భంలో జగన్ కు మద్దతు ఇస్తూనే, కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పుడు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేపైన గురిపెట్టి బిజెపి వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడం వంటి అన్ని పరిణామాలు మంట పుట్టిస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీలోనూ ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంది. ఏ పార్టీలోనూ నాయకులు మనశ్శాంతిగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఈ పరిస్థితులలో మార్పు వస్తుందా లేదా ఎప్పటికీ ఏపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయా అనే సందేహాలు జనాల్లో కలుగుతున్నాయి. అసలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: