తెలుగు రాష్టాల్లో మీడియా పార్టీల వారీగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగురాష్ట్రాలు అనే ఏముంది.. జాతీయ స్థాయిలోనూ ఒక్కో మీడియా ఒక్కో పార్టీని సపోర్టు చేసేలా మారిపోయాయి. ఇది మీడియాలో వస్తున్న మార్పుగా తీసుకోక తప్పని పరిస్థితి. ఏ పార్టీకి కొమ్ముకాయని.. ఏ పార్టీని సపోర్టు చేయని.. అచ్చమైన జర్నలిజం ఆధారంగా వస్తున్న మీడియా ఏదంటే.. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఏవో ఒకటి, రెండు మీడియాలను మినహాయిస్తే.. అన్నీ అలాగే తయారయ్యాయి.

ఏపీ విషయానికి వస్తే.. ఏ పత్రికలు టీడీపీకి అనుకూలమో.. ఏ పత్రికలు జగన్‌కు అనుకూలమో పాఠకులకు కూడా తెలుసు. ఇక టీడీపీకి ఫుల్ సపోర్టు ఉంటుందని ముద్రపడిన ఆంధ్రజ్యోతి.. జగన్ సర్కారుపై తరచూ విమర్శలు గుప్పిస్తుంటుంది. ఇక ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో తరచూ జగన్‌ తీరును ఎండగడుతుంటారు. తన తాజా కొత్తపలుకులోనూ అదే చేశారు.

ఏపీలో పెరుగుతున్న కుల, మత వైషమ్యాలపై విశ్లేషించిన ఆర్కే.. నిజానికి కులమతాలు కూడు పెట్టవని.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే ఉన్న కుల వైషమ్యాలను మరింత రగిలించడం వల్ల జగన్‌రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి పదవి లభించిందిని చెబుతున్నారు. అందుకే.. ఇదేదో మంచి చిట్కానే అనుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే బాటలో మతం కార్డును వాడుతున్నారని చెబుతున్నాడు. అంటే కులమత రాజకీయాలు మంచివి కావని చెబుతూనే జగన్ చేశాడు కాబట్టి మా బాబు కూడా చేస్తున్నాడని సమర్థించుకుంటున్నారు.

ఏపీలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నది అందరూ అంగీకరించే అంశమేనని.. అయితే, ఇప్పటివరకు ఈ అంశం రాజకీయపార్టీల ఎజెండాలో లేదని... ఇప్పుడు ఇది కూడా రాజకీయపార్టీల ఎజెండాలో చేరిపోయిందని ఆర్కే చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు ఓటు బ్యాంకుగా మారిపోయారని.. వారంతా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మద్దతుదారులుగా మారిపోయారని... ఈ నేపథ్యంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారిపోయిందని ఆర్కే చెబుతున్నారు.అందుకే.. హిందువుల ఓట్లకోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పోటీపడుతున్నాయని ఆర్కే విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: