ఎట్టకేలకు కేంద్రం కళ్లు తెరిచింది. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉండటంతో టీకాల కార్యక్రమం వేగవంతం చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పటికి దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. 140 కోట్ల జనాభాకు టీకాలు అందించడం కేవలం వీటి వల్లే సాధ్యం కాదు. అందుకే ఇతర దేశాల వ్యాక్సీన్లకు కూడా అనుమతులు వేగంగా మంజూరు చేయాలని నిర్ణయించింది.


ఇప్పటికే రష్యా స్పుత్నిక్‌ టీకాకు అనుమతి ఇచ్చిన కేంద్రం మిగిలిన కంపెనీలకు కూడా ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో అనుమతులు ఇవ్వబోతోంది.  దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ను అందిస్తుండగా అక్టోబర్‌ కల్లా మరో 5 టీకాలు అందుబాటులోకి రానున్నాయి.  కరోనా టీకాలు అవసరాల మేరకు సరిపోవడం లేదని రాష్ట్రాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

పెద్దఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి చేస్తే తప్ప డిమాండ్‌ను అందుకునే పరిస్థితి లేదు. దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాక్సిన్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ఇప్పుడు అదనంగా రష్యా టీకా స్పుత్నిక్‌-వీకు అనుమతి వచ్చింది. ఇవి కాకుండా మరో 4 టీకాలకు అనుమతులు ఇవ్వబోతున్నారు. ఆ టీకాలు ఏంటంటే.. జాన్సన్‌ అండ్ జాన్సన్‌,  నోవాక్స్‌, జైడస్ కాడిలా వ్యాక్సిన్, భారత్ బయోటెక్‌కు చెందిన ఇంట్రా నాసల్‌ టీకాలు.

ఇందులో కొన్ని ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి కూడా.  కేంద్రం వీటికి పచ్చజెండా ఊపితే.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో అనుమతుల వ్యవహారం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తే మంచిది. టీకాలతోనే రెండేళ్ల నుంచి  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు చెక్ పెట్టగలం.

కరోనా వేళ భారత్ ప్రపంచానికే వ్యాక్సీన్ సరఫరా దారుగా మారిందన్న పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకూ ఇండియా 71 దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసింది. ఇండియా ఒక విధంగా ప్రపంచాన్నే కాపాడుతోంది. తన టీకాలతో ప్రపంచానికి రక్షణగా నిలుస్తోంది. అయితే ముందు సొంత పౌరులను కాపాడుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: