రాజ‌కీయ ఉద్దండుల‌ను, వారి వ్యూహాల‌ను తిప్పికొట్టాలంటే కొంచెం ఓపిక ఉండాలి, వ్యూహాత్మ‌క దూకుడుతోపాటు స‌మ‌యం కోసం ఎదురుచూస్తుండాలి, ఇత‌రుల మ‌ద్ద‌తు కూడ‌గట్టుకోవాలి.. వీట‌న్నింటిని పోగేసుకొని బ‌రిలోకి దిగితే.. ఎంత‌టి బ‌ల‌వంతుడినైనా మ‌ట్టిక‌రిపించొచ్చు.. ఇదే వ్యూహాన్ని మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఫాలో అవుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతుంది. అధికారంలో ఉన్న తెరాస‌ను ఢీకొట్టాలంటే ఈట‌ల బ‌లం, వ్యూహాలు మాత్ర‌మే స‌రిపోవు. ఈట‌ల‌కు తోడు ప్ర‌జాబ‌లం, ఇత‌ర పార్టీల రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌లు తోడైతే సీఎం కేసీఆర్‌కు షాకివ్వ‌చ్చు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఈట‌ల అదేదారిలో అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇత‌ర పార్టీల నేత‌ల‌తో వ‌రుస భేటీల‌కు తోడు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాబ‌లం కూడ‌గ‌ట్టుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెరాస ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ఈట‌ల దూకుడును ప్ర‌ద‌ర్శించేవారు. సీఎం కేసీఆర్ త‌న‌కు అప్ప‌గించిన ప‌నులు పూర్తిచేస్తూనే.. మ‌రోప‌క్క త‌న‌కు ఇబ్బంది క‌లిగించేలా వ్యవ‌హ‌రిస్తే అదేస్థాయిలో మాట‌ల తూటాలు పేల్చేవాడు. దీంతో తెరాస నేత‌ల‌తో పాటు, ప్ర‌జ‌ల్లోనూ ఈట‌లపై మంచి అభిప్రాయం ఉండేది. ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడ‌తాడ‌న్న పేరు ఈట‌ల‌కు ఉంది. అదే ఈట‌ల‌కు స‌మ‌స్య‌గానూ మారింద‌న్న వాద‌న ఉంది. అధిష్టానాన్ని ఇరుకన పెట్టే వ్యాఖ్య‌లు చేస్తుండ‌టంతో సీఎం కేసీఆర్ అదునుచూసి ఈట‌ల‌కు పార్టీలో చెక్‌పెట్టాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈట‌ల‌సైతం ఎక్క‌డా వెన‌క్కుత‌గ్గ‌కుండా సీఎం కేసీఆర్‌పై కాలు దువ్వుతున్నాడు. ఇప్ప‌టికే సానుభూతి అనే అస్త్రంతో ప్ర‌జామ‌ద్ద‌తును త‌న‌వైపుకు తిప్పుకున్న ఈట‌ల, తాజాగా తెరాస‌యేత‌ర పార్టీల్లోని ముఖ్య‌నేత‌ల‌ను క‌లుస్తూ త‌న అభిప్రాయాన్నివివ‌రిస్తున్నారు.

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్.. సుమారు రెండు గంట‌ల పాటు ఆయ‌న‌తో తాజా రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. అదేవిధంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, తెరాస సీనియ‌ర్ నేత డీఎస్‌నుసైతం క‌లిసి ఈట‌ల‌.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు, త‌న వ్యూహాలను వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన డీఎస్ త‌న‌యుడు, బీజేపీ ఎంపీ అర‌వింద్‌తోనూ ఈట‌ల భేటీ అయ్యాడ‌న్న ప్ర‌చారం సాగుతుంది. అంతేకాక బీజేపీ నేత‌, మాజీ మంత్రి ఏ. చంద్ర‌శేఖ‌ర్‌రావుతోనూ ఈటల భేటీ అయ్యారు. త్వ‌ర‌లో రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌ల‌ను కూడా ఈట‌ల క‌లిసే అవ‌కాశాలు ఉన్నాయి. సీనియ‌ర్ నేత‌ల‌తో భేటీల స‌మ‌యంలో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ఈట‌ల కోరుతున్న‌ట్లు స‌మాచారం. లాక్‌డౌన్ త‌రువాత ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మేర‌కు ఆయ‌న అనుచ‌రులుసైతం ఇదే విష‌యాన్ని ధృవీక‌రిస్తున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాచేస్తే.. ఉప ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అన్నిప్ర‌య‌త్నాలు చేస్తాడ‌న్న‌ భావ‌న‌లో ఈట‌ల ఉన్నారు.

అందులోనూ అధికారం మొత్తం సీఎం కేసీఆర్ చేతిలోనే ఉండ‌టంతో పాటు.. త‌న‌పై మ‌రిన్ని త‌ప్పుడు అభియోగాలు మోపి ఇరుకున పెట్టేలా ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌న్న భావ‌న ఈట‌ల‌ను వెంటాడుతుంది. దీంతో ఉప ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగేందుకు ఈట‌ల ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే హుజురాబాద్‌లో తెరాస‌ను ఢీకొట్టేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లను ఈట‌ల క‌లుస్తున్నాడ‌న చ‌ర్చ సాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిస్తే కేసీఆర్‌ను ఢీకొట్ట‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌ని, హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో తెరాస ఓట‌మిపాలైతే.. ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేఖ‌త పెరుగుతుంద‌ని, అది బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు రాబోయే ఎన్నిక‌ల్లో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయా పార్టీల నేత‌ల‌కు ఈట‌ల వివ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈట‌ల ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: