వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతల అరెస్టుల పర్వంతో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే వీరిలో ఎక్కువగా హైలెట్ అయింది మాజీ ఎంపీ సబ్బంహరి. ఆయన 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యాడు. టీడీపీ అనుకూల ఛానెల్స్‌లో నిత్యం డిబేట్‌లలో పాల్గొంటూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. రెండుమూడు రోజులకోసారి చానెల్స్‌లో లైవ్ డిబేట్‌లలో పాల్గొంటూ జగన్, ఆయన ప్రభుత్వాన్ని తూర్పారపట్టేవారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలోని సబ్బంహరి ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అయితే ఇటీవల కరోనాతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు.
సబ్బం హరితో పాటు టీడీపీకి ఆయుధంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మారారు. రఘురామ వైసీపీ ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపైనా, వైసీపీ ప్రభుత్వం విధానాలపైన తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. నిత్యం టీడీపీకి అనుకూల ఛానెల్స్ డిబెట్‌లలో పాల్గొంటూ జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలకంటే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది రఘురామ కృష్ణంరాజని చెప్పవచ్చు. ఇటీవలకాలంలో ప్రతీరోజూ లైవ్ ప్రోగ్రాం పేరుతో జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన అరెస్టు టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివాజి, సబ్బం హరి, రఘురామ కృష్ణంరాజు తరువాత టీడీపీ వాయిస్‌ను ప్రజలకు వినిపించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి