తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు భలే ఇరకాటంలో పడ్డారు. తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని అనుచితంగా తూలనాడిన అస్సాం సీఎం బిశ్వ శర్మపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.. వాస్తవానికి ఈ విషయంలో కేసీఆర్‌ వైఖరిని మెచ్చుకోవచ్చు.. ఎలాంటి వ్యూహం ఉందో తెలియదు కానీ.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై మాత్రం కేసీఆర్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి ఈ విషయంలో పూర్తి సంఘీభావం ప్రకటించారు.


కానీ.. ఈ విషయంలో కేసీఆర్‌ను ఎలా అర్థం చేసుకోవాలో రేవంత్ రెడ్డికి ఓ పట్టాన అర్థమైనట్టు లేదు.. ఎలాగైనా వ్యతిరేకించాలన్న ఎత్తుగడతోనో.. లేక కేసీఆర్‌కు మైలేజీ రాకూడదన్న ఉద్దేశ్యంతోనే తెలియదు కానీ.. అస్సాం సీఎంపై కేసులు పెట్టే విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరించలేదంటూ రేవంత్ రెడ్డి విమర్శించడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. వాస్తవానికి కేసీఆర్ స్పందించినప్పుడు కాంగ్రెస్ కూడా పాజిటివ్‌ గా స్పందిస్తే బావుండేది.. పార్టీలకు అతీతంగా ఇలా ఎవరిని తిట్టినా తప్పే కాబట్టి.. కేసీఆర్ రాహుల్ గాంధీకి సంఘీభావం తెలపడాన్ని రేవంత్ రెడ్డి వంటి వారు స్వాగతిస్తే బావుండేది.


అలా కాకుండా.. ఎలాగైనా కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాలనే ఉద్దేశ్యంతో అస్సాం సీఎంపై కేసులు పెట్టే కార్యక్రమం చేపట్టారు. స్వయంగా తాను ఫిర్యాదు ఇచ్చినా.. సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదన్న వాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా విమర్శల పాలైంది. అన్ని సమయాల్లోనూ రాజకీయాలే చేయాలన్న నియమం ఏమీ ఉండదు.. కొన్ని సార్లు ఎదుటి పక్షాన్ని స్వాగతించడం కూడా రాజకీయంగా మేలు చేస్తుంది.. ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తించినట్టు రేవంత్ రెడ్డి గుర్తించినట్టు లేదు.



అందువల్ల ఈ ఎపిసోడ్‌లో కేసీఆర్ మంచి మార్కులు కొట్టేయగా.. రేవంత్ రెడ్డి మాత్రం ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు.. కేసీఆర్ వ్యాఖ్యలు, ఎత్తుగడ చూస్తుంటే.. అవసరమైతే కాంగ్రెస్‌ తోనైనా జట్టు కడతాం కానీ.. బీజేపీతో మాత్రం కలవం అన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే నిజమైతే పాపం రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడినట్టే.. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్‌లో ఇరకాటంలో పడిపోయారని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: