వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం కేసీఆర్ మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనితో పాటు ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా శాఖ మొత్తం పాల్గొంది ఒక్క ఆయన తప్ప. ఆయనెవరో కాదు మాజీ మంత్రి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టి ఇతర జిల్లాలో పర్యటించారు. అది కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అసంతృప్త నేతలతో భేటీ అయ్యారు.
జూపల్లి ఖమ్మం జిల్లాకు వెళ్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలోతమ రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీ ఎజెండానే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొదట తుమ్మల వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయనతో దాదాపు గంట సేపు భేటీ అయిన జూపల్లి చాలా విషయాలే చర్చించారట.
తిరుగు ప్రయాణంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి వెళ్లి గంటల పాటు మంతనాలు జరిపారు. ఈ భేటీలో ఏమేం చర్చించారనే వివరాలు బయటికి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన జూపల్లి తదనంతర పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరారు. క్రితం సారి కొల్లాపూర్ నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత హర్షవర్దన్ కూడా గులాబీ పార్టీ పంచన చేరారు. దీంతో జూపల్లి, బీరం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందనే ధీమాలో హర్షవర్దన్ రెడ్డి ఉన్నారు.
దీంతో జూపల్లి అడుగులు టీఆర్ఎస్ లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో తుమ్మల, పొంగులేటి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావడంతో జూపల్లి వారితో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరందరూ కలిసి కారుకు టాటా చెబుతారా..? ఇతర పార్టీల్లో చేరతారా.. లేదా సొంత పార్టీ ఏదైనా పెడతారా.. అనే సందేహాలు నెలకొన్నాయి. పార్టీ అధిష్ఠానాన్ని బెదిరించడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి