గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కేవలం ఐదుగురికి మాత్రమే చేరి ఉండొచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారట.. ఈ మేరకు రాజశేఖర్, ప్రవీణ్ ను ప్రశ్నించినప్పుడు ఐదు పేర్లు మాత్రమే బయటపడ్డాయట. టీఎస్ పీఎస్సీలో ఏఎస్ఓ గా పనిచేస్తున్న ప్రవీణ్ తన కోసమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడట. ఆ తర్వాత తన సహోద్యోగులైన షమీమ్, రమేష్ తో పాటు సురేష్ కు ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలిందట. రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ రెడ్డికి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని అందించాడని సిట్ అధికారులు గుర్తించారట.


నిందితులను 2సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయంలో ఐదుగురు పేర్లే బయటికి వచ్చాయని సిట్ అధికారులు చెబుతున్నారట. నిందితులు నోరు విప్పడం లేదా లేకపోతే ఆ గ్రూపు వరకే ప్రశ్నాపత్రాలు పరిమితమయ్యాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోందట. మొత్తం మీద ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12మందికి చేరినట్లు తేల్చారట. డాక్య, రాజేశ్వర్ నాయక్ కలిసి పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలిందట.


ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసి పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. మిగతా 8 మంది ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారట. గ్రూప్ 1 పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిలో ఇప్పటికే 84 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారట. మిగతా వాళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారట.


మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తే.. అబ్బే.. టీఎస్‌పీఎస్సీ నుంచి లీకేజీ అయిన మాట వాస్తవమే కానీ.. ఎక్కువ మందికి వెళ్లలేదని చూపించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఎలాగూ చెడ్డపేరు వచ్చింది.. అయితే.. అది సాధ్యమైనంత తక్కువగా ఉండేలా సిట్‌ అధికారులు జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: