దళితుల్లో ఒక వర్గం ఆధిపత్యంతో మిగతా పది ఉప కులాలకు ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై దండోరా మొగించినవారు మందకృష్ణ మాదిగ. 1994 జులై 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాటం మొదలు పెట్టారు. వరంగల్ జిల్లా శాయంపేటలో పుట్టిన ఆయన 30 ఏళ్లుగా వర్గీకరణపై సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎస్సీ వర్గకరణకు హామీ ఇచ్చిన పార్టీలు తర్వాత ఓట్లు వేయించుకొని గెలిచి ఆ నెపాన్ని కేంద్రం పై వేసి చేతులు దులుపుకుంటున్నాయి.


అయితే ఎస్సీల్లో మాదిగలకు వెనుకబాటు తనానికి గురవుతున్నారనే విషయాన్ని గుర్తించిన మందకృష్ణ మాదిగ 10మంది యువకులతో చిత్తూరు నుంచి తన పోరాటాన్ని ప్రారంభించారు.  అయితే ఆ అంశాన్ని రాజకీయంగా మలచుకొని లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. కానీ మందకృష్ణ మాత్రం స్వచ్ఛందంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆయనకు ఏ పదవి కట్టబెట్టలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, ఇతర నామినేటిడ్ పదవులు ఏవీ కూడా ఇవ్వలేదు.


కానీ ఆయన్ను అడ్డుపెట్టుకొని టీడీపీ బాగానే లబ్ధి పొందింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా చేసింది. 30 ఏళ్ల నుంచి అనేక త్యాగాలు చేస్తూ పోరాటాలు సాగించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ గుర్తించి మందకృష్ణ మాదిగ తన యవ్వనాన్ని అంతా పోరాటానికే ధారపోశారు అని వ్యాఖ్యానించారు.


అయితే రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో మాదిగలు.. ఏపీలో మాలలు ఎక్కువగా ఉండటంతో టీడీపీ ఆయన్ను వదిలిపెట్టింది. ప్రధాని మోదీ మాత్రం ఎస్సీల వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని త్వరలోనే కమిటీ వేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా  ఈ విషయంలో మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పడం ఆయన నా సోదరుడితో సమానం అని వ్యాఖ్యానించారు. ఒకవేళ బీజేపీ మరలా అధికారంలోకి వచ్చి ఈ వర్గీకరణ చేపడితే మందకృష్ణ చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతారు అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: