కాంగ్రెస్ పార్టీ అంటేనే మహా సముద్రం. స్వేచ్ఛ ఎక్కువ. వర్గాలు, కుమ్ములాటలు.. అధిష్ఠాన నిర్ణయాలు. . ఇలా రకరకాల అభిప్రాయాల సంగమం. అలాంటి పార్టీలో సీఎం పదవి దక్కడం అంటే మామూలు విషయం కాదు. దీనికంటే ముందు పీసీసీ పదవి దక్కించుకోవడం కూడా అంత సులభం ఏమీ కాదు. అయితే ఈ రెండింటిని సాధించిన అదే ఊపులో ఎన్నికలను ఎదుర్కొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.


అయితే పీసీసీ అనేది పార్టీ అధ్యక్ష పదవి. సీఎం అనేది ప్రభుత్వ పదవి. గతంలో వీటిని ఇద్దరు వ్యక్తులు చూసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి జోడెడ్లు లాంటివి. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి రెండు పదవులను నిర్వర్తిస్తున్నారు. ఆయన సారథ్యంలోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎంపీ ఎన్నికలకు కూడా ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉండనున్నారు. దీంతో ఈ ఎన్నికల భారమంతా సీఎంపైనే పడనుంది.


ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే.. తన మాటను నెగ్గించుకుంటున్నారు.  వాస్తవానికి ఈ ఎంపీ సీట్లలో 12కి పైగా స్థానాలు గెలుచుకోకపోతే ఆయన ఆధిపత్యానికి గండి పడే అవకాశం ఉంది. ఈ విషయం సీఎంకు కూడా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, సభలు సమావేశాలు, చేరికలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్నారు.


ప్రస్తుతం పార్టీలో స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే రేవంత్ రెడ్డి పేరు చెబుతారు అందరూ. మిగతా సీనియర్లకు ఫాలోయింగ్ ఉన్నా.. రేవంత్ కు ఉన్న మాస్ క్రేజ్ లేదనే చెప్పాలి. తొలినాళ్లలో డిప్యూటీ సీఎం, మంత్రి కోమటి రెడ్డి లను కలుపుకొని వెళ్లిన ఆయన ఇప్పుడు తన మార్క్ చూపించాలనే తాపత్రయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరో వైఎస్సార్ లా మారాలని సీఎం భావిస్తున్నారు. పార్టీలో తన మాటకు ఎదురు లేకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఇదంతా జరగాలంటే ఈ ఎన్నికల్లో రెండెంకల సీట్లు సాధించాలి.  ఇది జరుగుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: