రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది ఓ నానుడి. అందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు. రాయలసీమకే చెందిన ఈ ఇద్దరు నేతలు.. ప్రత్యర్థులుగా ఏళ్లతరబడి కొనసాగారు. వైఎస్‌ బతికున్నంత వరకూ చంద్రబాబుపై నిప్పులు కురిపించేవారు. రాజకీయంగానూ ప్రత్యర్థులుగా ఎత్తులు, పై ఎత్తులు వేసుకున్నారు. అనేక ఎన్నికల్లో రాజకీయంగా తలపడ్డారు. మరీ ప్రత్యేకంగా 2004, 2009 ఎన్నికల్లో వీరి రాజకీయ సమరం చెప్పుకోదగింది.ఇక అసెంబ్లీలో వీరి మధ్య మాటల యుద్ధాలే జరిగేవి. ఇంతగా శత్రువులుగా మారిన వీరిద్దరూ మొదట్లో చాలా మంచి మిత్రులన్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే.. ఇద్దరూ ఒకే ఏడాదిలో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే ఇద్దరూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇద్దరూ మొదట్లో కాంగ్రెస్‌లోనే ఉండేవారు. చంద్రబాబు చకచకా పావులు కదిపి రాజకీయంగా ఎదిగి తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే మంత్రి కూడా అయ్యారు. ఆ తరవాత ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశంలోకి వచ్చి.. ఇక్కడ కీలక పాత్ర పోషించారు. దీంతో వైఎస్‌, చంద్రబాబు దారులు వేరయ్యాయి.కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో నిద్రించిన సందర్భాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు కూడా గతంలో పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకున్నారు. ఆ మధ్య బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 షోలో చంద్రబాబును మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు అని అడిగితే చంద్రబాబు నాయుడు.. గుక్కతిప్పుకోకుండా ‘వైఎస్ రాజశేఖరరెడ్డి’ అని చెప్పడం విశేషం.కాంగ్రెస్‌లో చేరిన తొలి రోజుల్లో చంద్రబాబు, వైఎస్సార్‌ ఇద్దరూ చాలా  క్లోజ్‌గా ఉండేవాళ్లట. వి1977, 83 సంవత్సరంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు ఈ విషయం బాగా తెలుసు. రాజశేఖరరెడ్డితో తనకు రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగతంగా విరోధం లేదని చంద్రబాబు చెప్పేవారు. చంద్రబాబు అలిపిరిలో నక్సల్స్ దాడికి గురైన సమయంలో వైఎస్‌ఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి చంద్రబాబు క్షేమ సమాచారం కనుక్కున్నారని చెబుతారు. ఇటీవల వైఎస్‌ షర్మిల తన కుమారుడి వివాహ హాజరుకావాలని చంద్రబాబును ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఆ సమయంలో చంద్రబాబు ఆమెతో.. వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి నెమరువేసుకున్నారట. అప్పట్లో ఎంత క్లోజ్‌గా ఉండేది.. ఏమేం చేసిందీ చంద్రబాబు గుర్తు చేసుకున్నారని వైఎస్‌ షర్మిల చెప్పుకొచ్చారు. మొదట్లో అంత స్నేహంగా ఉన్న వైఎస్‌, చంద్రబాబు.. ఆ తర్వాత రాజకీయంగా వేరు దారుల్లో ప్రయాణం చేసి రాజకీయ శత్రువులుగా మారారు.అసెంబ్లీలో వైఎస్‌, చంద్రబాబు ఉంటే.. ఆ మాటల యుద్ధం ఓ రేంజ్‌లో ఉండేది. ప్రత్యేకిం 2004-2009 మధ్యలో వీరి రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. ఒక దశలో అసెంబ్లీలో వైఎస్ చంద్రబాబుపై నిప్పులు కురింపించారు. కడిగేస్తాను నిన్ను ఇవాళ చంద్రబాబూ అంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. అసలు నీ తల్లి గర్భంలో ఎందుకు పుట్టానా అని నువ్వు బాధపడేలా చేస్తానంటూ రెచ్చిపోయారు. 2009 ఎన్నికల తర్వాత టీడీపీ ఫినిష్‌ అవుతుందన్నారు. అలా అన్న కొద్ది రోజులకే వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. అందుకే తెలుగు రాజకీయాల్లో స్నేహం గురించి మాట్లాడుకోవాలాలన్నా.. శత్రుత్వం గురించి మాట్లాడుకోవాలన్నా ముందుగా గుర్తొచ్చేది వైఎస్‌ఆర్‌, చంద్రబాబు.. ఈ రెండు పేర్లే అంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr